సూర్య చేస్తున్నాడు.. రవితేజ డ్రాప్ అయినట్లే

సూర్య చేస్తున్నాడు.. రవితేజ డ్రాప్ అయినట్లే

స్పెషల్ చబ్బీస్.. నాలుగేళ్ల కిందట హిందీలో సంచలన విజయం సాధించిన థ్రిల్లర్. 30 ఏళ్ల కిందట సీబీఐ పేరుతో ఒక దోపిడీ ముఠా కోట్లు కొల్లగొట్టేసిన ఉదంతం నేపథ్యంలో నీరజ్ పాండే రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్టయింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ముందు నాగార్జున హీరోగా ఈ సినిమా తీయాలనుకున్నారు. ఆ తర్వాత రవితేజ లైన్లోకి వచ్చాడు. మాస్ రాజా ఒక టైంలో ఈ చిత్రం గురించి సీరియస్‌ గానే ఆలోచించాడు. తమిళ నిర్మాత త్యాగరాజన్ ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకుని.. రవితేజ హీరోగా సినిమా చేయడానికి చాలా పట్టుదల ప్రదర్శించాడు. కానీ రవితేజ తాత్సారం చేయడంతో ఆ సినిమా ఎటూ తేలకుండా పోయింది.

ఐతే ఈలోపు తమిళంలో ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ రెడీ అయిపోతోంది. స్టార్ హీరో సూర్యనే ఈ చిత్రంలో హీరో కావడం విశేషం. ‘సింగం-3’ తర్వాత సూర్య.. ‘తానా సేంద కూట్టం’ పేరుతో ఒక సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగులోకి ‘నేను రౌడీనే’ పేరుతో డబ్ అయిన ‘నానుమ్ రౌడీదా’ సినిమాను రూపొందించిన విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం కోసం సూర్య తన అవతారం కొద్దిగా మార్చుకున్నాడు. ఐతే ఈ చిత్రం హిందీలో ఉన్నట్లు మక్కీకి మక్కీ దించేయట్లేదని.. తమిళ వెర్షన్ కోసం చాలా మార్పులు చేస్తున్నామని.. హిందీతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని అంటున్నాడు సూర్య. మరి సూర్య చేస్తున్నాడంటే.. అది ఆటోమేటిగ్గా తెలుగులోకి అనువాదం అవుతుంది. కాబట్టి రవితేజ ఇక ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ విషయంలో డ్రాప్ అయిపోయినట్లే అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు