ఆర్ఆర్ఆర్.. డీల్ అయిపోయింది

ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అగ్ర స్థానం ‘ఆర్ఆర్ఆర్’కు కట్టబెట్టాల్సిందే. ఇది బేసిగ్గా తెలుగు సినిమానే కానీ.. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో దీనికి ఆటోమేటిగ్గా పాన్ ఇండియా స్టేటస్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా మొదలైన కొన్ని రోజులకే ఈ చిత్రానికి బిజినెస్ మొదలైపోయింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొన్ని ఏరియాలకు బిజినెస్ కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. ఇటీవలే డిజిటల్, శాటిలైట్ హక్కుల డీల్ కూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు దీనిపై అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చేసింది.

‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి అన్ని భాషలకూ కలిపి డిజిటల్, శాటిలైట్ హక్కులను బాలీవుడ్‌కు చెందిన పెన్ మూవీస్ సొంతం చేసుకుంది. దీని అధినేత జయంతిలాల్ గద ఇటీవలే ఒప్పందాన్ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని గురువారం ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించింది. ఈ సంస్థ వివిధ భాషల డిజిటల్, శాటిలైట్, ఇంటర్నెట్ హక్కులనే కాదు.. నార్త్ ఇండియా వరకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సైతం సొంతం చేసుకోవడం విశేషం.

‘బాహుబలి’ని హిందీలో అదిరిపోయే రీతిలో మార్కెట్ చేసి.. భారీగా రిలీజ్ చేసి సినిమా ఉత్తరాదిన ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరణ్ జోహార్ సైతం రేసులో నిలిచారట కానీ.. ఆయన్ని మించి భారీ రేటుతో జయంతిలాల్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్, ఇంటర్నెట్ హక్కుల కోసం ఆయన రూ.200 కోట్లకు పైగానే చెల్లించబోతున్నట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమాల్లో రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.