చరిత్రలో నిలిచిపోయే కామెడీ అంట!

చరిత్రలో నిలిచిపోయే కామెడీ అంట!

ఎప్పుడో ‘పూల రంగడు’ సినిమాతో హిట్టు కొట్టాడు కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్. అప్పట్నుంచి హిట్టు కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మిస్టర్ పెళ్లి కొడుకు.. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. జక్కన్న.. ఈడు గోల్డ్ ఎహే.. ఇలా వరుసగా ఐదు ఫ్లాపులు తినేసి డబుల్ హ్యాట్రిక్ ముంగిట ఉన్నాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఉంగరాల రాంబాబు’ మీదే ఉన్నాయి.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ లోగోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. ‘ఉంగరాల రాంబాబు’ చరిత్రలో నిలిచిపోయే సినిమా అనేశాడు.

ఓనమాలు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల తర్వాత కొంచెం భిన్నంగా కామెడీ ఫిల్మ్ చేయాలనుకున్నానని.. ఐతే కామెడీ అంటే రెగ్యులర్ సినిమాల్లో లాగా లౌడ్‌గా ఉండి అప్పటికప్పుడు మరిచిపోయేలా ఉండదని.. కొన్నేళ్ల పాటు చరిత్రలో నిలిచిపోయే కామెడీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని క్రాంతి మాధవ్ చెప్పాడు. ఈ సినిమా కథ రాశాక తనకు సునీల్ తప్ప మరో హీరో ఆప్షన్‌గా కనిపించలేదని క్రాంతి మాధవ్ అన్నాడు. ఇక సునీల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ లోగో చూడగానే నవ్వొస్తుందని.. సినిమాలో దీనికి వంద రెట్ల వినోదం ఉంటుందని చెప్పాడు.

క్రాంతి మాధవ్ సెంటిమెంటు సినిమా తీసినా.. లవ్ సినిమా తీసినా.. కామెడీ మూవీ తీసినా.. అందులో సమాజానికి ఎంతో కొంత మంచి చెబుతాడని.. ఇలాంటి దర్శకుడు తనకు తెలిసి క్రాంతి మాధవ్ ఒక్కడేనని.. ‘ఉంగరాల రాంబాబు’లోనూ కామెడీతో పాటు మంచి విషయాలు చాలా ఉన్నాయని.. తన కెరీర్లో ఇదొక మైలురాయి లాంటి సినిమా అని అన్నాడు. వీళ్లింతగా చెబుతున్న ఈ సినిమాలో ఏముందో ఈ వేసవిలో తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు