చిరంజీవికది కంఫర్ట్‌ జోనేనా?

చిరంజీవికది కంఫర్ట్‌ జోనేనా?

సినిమాల్లో చిరంజీవి ఎప్పుడూ తన కంఫర్ట్‌ జోన్‌ వీడి బయటకి రావడానికి ఇష్టపడరు. నూట యాభై సినిమాల కెరియర్లో చిరు చేసిన ప్రయోగాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అభిమానులకి నచ్చేలా తన సినిమాలుండాలని, నిర్మాతలకి డబ్బులు తెచ్చిపెట్టేలా తీర్చిదిద్దాలని చిరు తపిస్తుంటారు. కంఫర్ట్‌ జోన్‌లో వుండడానికి ఇష్టపడతారు కనుకే రీఎంట్రీకి కూడా ఖైదీ నంబర్‌ 150లాంటి కమర్షియల్‌ కథని ఎంచుకున్నారు.

రాజకీయాలు తన జోన్‌ కాదని చిరంజీవికి అర్థం కావడానికి పదేళ్లు పట్టింది. తాజాగా ఆయన బుల్లితెరపైకి వస్తున్నారు. ఇంతకాలం వెండితెరపై రారాజులా వెలిగిన చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై తన మ్యాజిక్‌ చేయడానికి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ వస్తున్నారు. ఫిబ్రవరి 13న తొలి ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవుతుంది. బుల్లితెరపై అందరూ సక్సెస్‌ కాలేకపోయారు. అమితాబ్‌ మాదిరిగా కెబిసికి షారుక్‌ ప్లస్‌ అవలేదు.

నాగార్జున సక్సెస్‌ అయిన ఈ షో హోస్ట్‌గా చిరంజీవి ఎలా మెప్పించబోతున్నారు. ఇక్కడ పాటలుండవు, మాస్‌ డైలాగులుండవు, కేవలం ఎమోషనల్‌గా ఆడియన్స్‌తో కనక్ట్‌ అవ్వాలి. ప్రతి వారం చిరంజీవి షో ఎప్పుడొస్తుందా అని జనం ఎదురు చూసేలా చేయాలి. సినిమాల్లో మాదిరిగా డ్రామాలు పని చేయవు. సహజత్వం ఉండాలి. హీరోయిజానికి స్కోప్‌ లేదు. మనవాడే అనిపించుకోవాలి. మరి ఇది చిరంజీవి కంఫర్ట్‌ జోనేనా? నాగార్జున కంటే ఈ షోని చిరు పెద్ద హిట్‌ చేయగలరా? సినీ జగతిని ఏలిన మెగాస్టార్‌కి ఇప్పుడిది తాజా పరీక్ష. లెట్స్‌ విష్‌ హిమ్‌ ఆల్‌ ది బెస్ట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు