మొత్తానికి అయ్యిందనిపించారు

మొత్తానికి అయ్యిందనిపించారు


ఒక సినిమా షూటింగ్ పెద్ద విషయమేమీ కాదు. సినిమా మొదలుపెట్టాక పూర్తవకుండా ఎక్కడికి పోతుంది? కానీ ఒక సినిమా పూర్తవడం చాలా పెద్ద వార్త కావడం హీరో గోపీచంద్ విషయంలోనే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా గోపీచంద్ సినిమాలకు ఏదో ఒక ఆటంకం ఎదురవడం.. అతడి సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో జనాలకు ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది. ‘జగన్మోహన్ ఐపీఎస్’ అనే సినిమా ఎంత ఆలస్యమైందో.. ఇప్పటికీ విడుదలకు నోచుకోక ఎలా ఇబ్బంది పడుతోందో తెలిసిందే. దీని తర్వాత ‘ఆక్సిజన్’ అనే క్రేజీ ప్రాజెక్టు కూడా ఆలస్యమవడం గోపీ కెరీర్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడేలా చేసింది.

తెలుగులో సినిమాలు మానేసిన ఎ.ఎం.రత్నం సుదీర్ఘ విరామం తర్వాత టేకప్ చేసిన ప్రాజెక్టు ఇది. అప్పట్లో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా తీసి ఎదురు దెబ్బ తిన్న రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఆక్సిజన్’ అనే పేరు పెట్టడంతో సినిమాపై బాగానే ఆసక్తి కలిగింది. చకచకా షెడ్యూళ్లు పూర్తయి సినిమా కూడా చివరి దశకు వచ్చింది. కానీ అంతలో గోపీచంద్‌కు.. జ్యోతికృష్ణకు ఏవో తేడాలు రావడంతో సినిమా ఆగింది. ఐదారు నెలలుగా ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. సినిమా గురించి అప్ డేట్ లేదు. దీంతో ‘జగన్మోహన్ ఐపీఎస్’ లాగే ఈ సినిమా కూడా ఎటూ కాకుండా పోతుందేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే ఉన్నట్లుండి ఈ సినిమా పూర్తయిందన్నట్లుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

అది పెద్ద వార్త అయిపోయింది. ఇలా సినిమా పూర్తవడం గురించి కూడా ఇంత చర్చ జరగడం చిత్రమే. గత కొన్నేళ్లలో ‘లౌక్యం’ మినహాయిస్తే గోపీకి హిట్టు లేదు. మరోవైపు ఇలాంటి వాయిదాలతో గోపీ కెరీర్ మరింతగా దెబ్బ తింటోంది. మరి కొత్త ఏడాదిలో అయినా అతడి రాత మారుతుందేమో చూడాలి. ‘ఆక్సిజన్’తో పాటు సంపత్ నంది సినిమా కూడా ఈ ఏడాదే రిలీజవబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు