ఏప్రిల్ 1 విడుద‌ల‌: మ‌ధ్య త‌ర‌గ‌తి గుండె గుభేల్‌!!

ఏప్రిల్ 1. సాధార‌ణంగా ప్ర‌తి నెల ప్రారంభ‌మ‌య్యేది 1వ తారీకుతోనే అయినా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 మాత్రం దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ పౌరులు, మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్రం గ‌త నెల‌లో ప్ర‌వేశ పెట్టిన సాధార‌ణ బ‌డ్జెట్ అమ‌ల్లోకి వ‌స్తుండ‌డ‌మే. ఈ బ‌డ్జెట్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఎక్కువ‌గా వినియోగించే వ‌స్తుల‌పై ప‌న్నులు, ధ‌ర‌లు పెరుగుతుండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేది. కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ ఒకటి నుంచే చాలా మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అనేక ప్రతిపాదనలు అమలులోకి వచ్చేది ఈ తేదీ నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల రూపంలో సామాన్యులపై భారంపడే అవకాశం కనిపిస్తోంది. విమానం ప్రయాణీకులు మరింత ఎక్కువ ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

కొత్త ఆర్థిక ఏడాది నుంచి కార్లు, బైక్‌ల ధరలు ప్రియం కాబోతున్నాయి. టీవీ, ఏసీలపై రూ. 3 వేల నుంచి 4వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తయారీ వ్యవయాలు పెరగడంతో ధరలు ప్రియం కాబోతున్నాయి. ఇక‌, ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన ద‌రిమిలా అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు కూడా మండిపోతున్నాయి. వీకెండ్ పార్టీల‌కు ఒక‌ప్పుడు వెయ్యి రెండు వేల‌తో స‌రిపోయేది… కానీ, ఏప్రిల్ నుంచి మాత్రం వీటిపై ప‌న్నులు.. రెస్టారెంట్ చార్జీలు కూడా భారీ ఎత్తున మోగ‌నున్నాయి. దీంతో మ‌రో రెండు వేలు పెరిగినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

అదేవిధంగానూత‌న విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో పుస్త‌కాల‌పై పెరిగిన జీఎస్టీ మ‌రింత భారంగా మార‌నుంది. యూనిఫాంలు, పుస్త‌కాలు… పెన్సిళ్లు అన్నింటిని జీఎస్టీలోని 18 శాతం నుంచి 28 శాతం ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. దీంత ఈ ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌నున్నాయి. అదేవిధంగా పెట్రోల్‌తో న‌డిచే వాహ‌నాల ధ‌ర‌లు ప‌ది వేల నుంచి 12 వేల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. పోనీ బ్యాట‌రీ వాహ‌నాలు కొందామ‌న్నా.. ఈఎంఐ సౌక‌ర్యం ఎత్తేశారు.ఇలా ఒక్క‌టేమిటి.. అన్ని రూపాల్లోనూ ఏప్రిల్ 1 మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల గుండెల‌ను గుభేల్ మ‌నేలా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.