శ్రీమంతుడు గొడవ.. 15 లక్షలు ఇస్తామన్నారట

శ్రీమంతుడు గొడవ.. 15 లక్షలు ఇస్తామన్నారట

ఎప్పుడో ఏడాదిన్నర కిందట విడుదలైన సినిమా ‘శ్రీమంతుడు’. ఇప్పుడీ సినిమా కథ విషయంలో పెద్ద గొడవ జరుగుతోంది. సినిమా విడుదల సమయంలో శరత్ చంద్ర అనే రైటర్ ఈ కథ నాది అంటూ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలేంటన్నది తెలియదు. ఐతే ఇప్పుడు కోర్టు నుంచి మహేష్ బాబు..కొరటాల శివలకు నోటీసులు వెళ్లడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది. ఈ నేపథ్యంలో శరత్ చంద్ర మీడియాతోనూ మాట్లాడాడు. తన వాదనేంటో వినిపించాడు.

తాను రాసిన ‘చ‌చ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టే కొరటాల శివ ‘శ్రీమంతుడు’ తీశాడని శరత్ చంద్ర నొక్కి వక్కాణించాడు. ఫేస్ బుక్‌లో తన నవలను షేర్ చేశానని.. అది చదివిన వాళ్లందరూ ‘శ్రీమంతుడు’ సినిమా దీని ఆధారంగానే తీశారని అంగీకరించారని.. తన నవల చదివిన ఒక్కరైనా భిన్నంగా స్పందిస్తే తాను ఈ పోరాటాన్ని ఆపేస్తానని ఆయన అన్నారు.

రచయితల సంఘంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే.. డబ్బులు సెటిల్ చేయించే ప్రయత్నాలు జరిగినట్లు శరత్ చంద్ర తెలిపాడు. రూ.15 లక్షలు ఇవ్వజూపారన్నారు. ఐతే తనకు డబ్బు అక్కర్లేదని.. గుర్తింపు కావాలని.. హృతిక్ రోషన్ హీరోగా తీయబోయే ‘శ్రీమంతుడు’ హిందీ వెర్షన్లో అయినా తనకు రచయితగా క్రెడిట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన పోరాటం ఎప్పటికీ ఆగదని.. తాను చనిపోయినా తన కొడుకు ఈ విషయంలో పోరాటం కొనసాగిస్తాడని ఆయన చెప్పారు. రచయితల సంఘంలో న్యాయం జరక్కపోవడం వల్లే తాను కోర్టు వరకు వెళ్లానని.. ఈ సలహా ఇచ్చింది ఇండస్ట్రీ వాళ్లేనని శరత్ చంద్ర తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు