ఉయ్యాలవాడ... ఊగిసలాట!

ఉయ్యాలవాడ... ఊగిసలాట!

రీఎంట్రీ కోసం కమర్షియల్‌ కథని ఎంచుకున్న చిరంజీవి ఈసారి చేసే సినిమా గుర్తుండిపోయేదిగా వుండాలని చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాను చేద్దామనుకుంటోన్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని ట్రాక్‌ ఎక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే 'ఖైదీ నంబర్‌ 150' తర్వాత వెంటనే మరో చిత్రం పూర్తి చేయాలనేది చిరంజీవి అభిమతమట.

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తలపెడితే చారిత్రిక చిత్రం కాబట్టి ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఎక్కువ. అది పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కనుక ఈలోగా ఏదైనా కమర్షియల్‌ స్క్రిప్ట్‌ కుదిరితే వేగంగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేసి, ఆలోగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయిస్తే మంచిదనేది చిరంజీవి ఆలోచన అని తెలిసింది.

కానీ సురేందర్‌ చెప్పిన కథ కానీ, మరో రైటర్‌ చెప్పిన కథ కానీ చిరంజీవిని ఎక్సయిట్‌ చేయలేదట. మరోవైపు పరుచూరి సోదరులు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లేటెస్ట్‌ డ్రాఫ్ట్‌ వినిపించారని, అది విని చిరంజీవికి ఈ చిత్రం చేయాలనే కుతూహలం మరింత పెరిగిందని టాక్‌ వినిపిస్తోంది. అగ్ర హీరోలతో సినిమాలు తీసిన అనుభవమున్నవాడు, సాంకేతిక పరమైన అవగాహన కలిగినవాడు కావడంతో ఈ ప్రాజెక్ట్‌కి సురేందర్‌ రైట్‌ అని చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని అతనికి అప్పగించినట్టు అనధికారిక సమాచారం.

అనుకున్నట్టుగా అన్నీ సిద్ధమైతే ఏప్రిల్‌లోనే ఇది మొదలు పెట్టాలని, లేని పక్షంలో ఒక కమర్షియల్‌ చిత్రం చేసిన తర్వాత ఇది ప్రారంభించాలని అనుకుంటున్నారని, అందుకే అధికారికంగా న్యూస్‌ ఇవ్వడం లేదని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు