పరుచూరి చెప్పిన 11 వేల రూపాయల కథ

పరుచూరి చెప్పిన 11 వేల రూపాయల కథ

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ రచయితలు పరుచూరి బ్రదర్స్. తెలుగులో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 330 సినిమాలకు రచన బాధ్యతలు నిర్వర్తించారు వాళ్లిద్దరూ. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన ఈ దిగ్గజ రచయితలు గత కొన్నేళ్లలో జోరు తగ్గించారు. ఈ ఇద్దరు సోదరుల్లో చిన్నవాడైన పరుచూరి గోపాలకృష్ణ ‘శ్రీవల్లి’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ రచయితగా తన ప్రస్థానం ఎలా మొదలైందో చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘‘నేను ఒక కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేసేవాడిని. కానీ సినిమాలపై ఆసక్తి ఉండేది. మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వాడిని. అప్పుడప్పుడూ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. చివరగా ఒకసారి మద్రాసు వెళ్లి వద్దామనుకున్నా. కానీ మా ఆవిడ ఇన్నాళ్లు తిరిగారు ఏమైనా సంపాదించారా అని అడిగింది. మద్రాసు వెళ్లొద్దని పట్టుబట్టింది. ఐతే అప్పుడు ఆమెకో మాట చెప్పాను. నవంబరు 1న వెళ్తున్నా. డిసెంబరు 1న వస్తాను. ఈ నెల రోజుల్లో కాలేజీలో నేను అందుకునే 1100 రూపాయల జీతాన్ని సినిమాల్లోనే సంపాదించుకుని తిరిగొస్తాను. అలా వచ్చానంటే సినిమాల్లో కొనసాగుతాను. లేదంటే మళ్లీ అటు వైపు వెళ్లను అని చెప్పి వెళ్లాను. బెజవాడ రైల్వే స్టేషన్లో వెయిట్ మిషన్ మీద నిలబడితే.. అందులోంచి ఒక కార్డు ముక్క వచ్చింది. దాని వెనుక మీకో ద్వారం మూసుకుంటే.. ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని రాసి ఉంది. లెక్చరర్‌గా నా ప్రస్థానం ముగిసి.. సినీ ప్రస్థానం మొదలవబోతోందని అనుకున్నా. మద్రాసు వెళ్లి నెల తిరిగాక వెనక్కి వచ్చా. మా అమ్మాయి నా పెట్టె తెరిచి చూస్తే అందులో 11 వేలున్నాయి. నా 11 నెలల జీతాన్ని ఒకే నెలలో సంపాదించుకుని వచ్చాను’’ అని పరుచూరి వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు