ఆమె విషయం లో జ‌గ‌న్ సారీ చెప్పాల్సిందేన‌ట‌!

ఆమె విషయం లో జ‌గ‌న్ సారీ చెప్పాల్సిందేన‌ట‌!

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెల‌గపూడి స‌చివాలయం స‌మీపంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చోటుచేసుకున్న ఓ చిన్న ఘ‌ట‌న ఏపీలో చిలికిచిలికి గాలివాన‌లా మారేలానే ఉంది. జ‌గ‌న్ కాన్వాయ్‌, భారీ జ‌న సందోహం వెళుతున్న స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిల‌ప్రియ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళుతున్నారు. కారులో ఆమెను గ‌మ‌నించిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆమె కారును అట‌కాయించారు. కారు బానెట్‌పై చేతుల‌తో కొడుతూ ఆమెకు నిర‌స‌న తెలిపారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పైనే విజ‌యం సాధించిన అఖిల‌ప్రియ‌... ఆ త‌ర్వాత నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న త‌న తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి టీడీపీలోకి చేరిపోయారు. త‌మ పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించి... ఆ ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే ఇంకో పార్టీలో ఎలా చేర‌తార‌ని, ఇది పార్టీ ఫిరాయింపుల కింద‌కే వ‌స్తుంద‌న్న ఆవేద‌న‌తోనే వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆమెను అడ్డుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అయితే వంద‌ల సంఖ్య‌లో ఉన్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌న కారు వైపున‌కు దూసుకుని రావ‌డంతో ఒంట‌రిగా ఉన్న అఖిల‌ప్రియ కాస్తంత భ‌యభ్రాంతుల‌కు గురై ఉంటార‌న్న వాద‌న‌లో ఎలాంటి సందేహం లేదు. అయితే అఖిల‌ప్రియ వెంట ఉన్న గ‌న్‌మ‌న్ స‌కాలంలో స్పందించి తూపాకీ తీయ‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా వెన‌క్కు త‌గ్గారు. అఖిల‌ప్రియ అక్క‌డి నుంచి ఎలాంటి అపాయం లేకుండానే వెళ్లిపోయారు. అయితే ఆ త‌ర్వాతే... దీనిపై అసలు రాజ‌కీయం చోటుచేసుకుంది. ఓ మ‌హిళా ఎమ్మెల్యేపై దాడి జ‌రుగుతుంటే.. విప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్ త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక‌పోయార‌ని టీడీపీ మంత్రులు, నేత‌లు వ‌రుస‌గా ఎదురు దాడి ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లోనే ఉన్న అఖిల‌ప్రియ కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చారు. జ‌గ‌న్‌పై ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అస‌లు జ‌గ‌న్‌కు మ‌హిళ‌ల‌పై గౌర‌వ‌ముందా? అని ఆమె ప్ర‌శ్నించారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై జ‌గ‌న్ కావాల‌నే దాడులు చేయిస్తున్నారా? అని కాస్తంత సూటిగానే నిల‌దీశారు. త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన మీడియా ఫుటేజీపై వైసీపీ త‌క్ష‌ణ‌మే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తానేమైనా ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేస్తున్నానా? అని కూడా ఆమె ప్ర‌శ్నించారు. దాడి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి తాను విజ‌యవాడ నుంచి క‌ట్టు క‌ద‌ల‌లేద‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు