ఆత్మహత్య చేసుకుంటా: హీరోకి ఫాన్‌ వార్నింగ్‌

ఆత్మహత్య చేసుకుంటా: హీరోకి ఫాన్‌ వార్నింగ్‌

హీరోలపై అభిమానంతో జీవితాలు నాశనం చేసుకున్న కుర్రాళ్లు ఎంతోమంది వున్నారు. అభిమాన హీరోల కోసం జరిగే కొట్లాటల్లో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తరచుగా వింటూనే వుంటాం. అభిమాన హీరోని ఎలాగైనా కలుసుకోవాలనే ఒక కుర్రాడు అతడిని కలుసుకునే అవకాశం దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బావిపైకెక్కి హల్‌చల్‌ చేసాడు.

 నవల్‌ఘడ్‌ అనే ఊరికి చెందిన షంషాద్‌ అనే కుర్రాడికి బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ అంటే పిచ్చి. ఎన్నోసార్లు అతడిని కలుసుకునే ప్రయత్నం చేసినా కానీ విఫలమయ్యాడు. తన అభిమాన స్టార్‌ని కలుసుకోలేకపోతున్నా అనే వ్యధతో జీవితం చాలించాలని అనుకున్నాడు. బావిపైకెక్కి ఆత్మహత్యకి పాల్పడబోయాడు. ఊరంతా కలిసి ఆపాలని చూసారు. పోలీసులు వచ్చి అతడిని బుజ్జగించారు. మొత్తానికి అజయ్‌ని కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతను తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నాడు.

త్వరలో అజయ్‌ని కలిసే అవకాశం రాకపోతే చచ్చిపోతానంటూ ఇప్పటికీ బెదిరిస్తున్నాడు. విషయాన్ని అజయ్‌ దేవ్‌గన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అతను సానుకూలంగా స్పందించాడు. త్వరలోనే తన ఊరికి దగ్గర్లో షూటింగ్‌కి వస్తున్నానని, అప్పుడు తప్పకుండా తనని కలుస్తానని షంషాద్‌కి అజయ్‌ దేవ్‌గన్‌ ట్విట్టర్‌ ద్వారా మాటిచ్చాడు. ఈ వ్యవహారం సద్దుమణిగినా కానీ ఇది చూసి మరికొందరు ఇన్‌స్పయిర్‌ అయి ఇలాంటివే మొదలుపెడితే మాత్రం హీరోలకి చాలా ఇబ్బందే సుమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు