పీకే రికార్డు బ‌ద్ద‌లు కాదా?

పీకే రికార్డు బ‌ద్ద‌లు కాదా?

అమీర్ ఖాన్ కొత్త సినిమా 'దంగ‌ల్‌' కు వ‌చ్చిన టాక్.. ఓపెనింగ్స్ చూస్తే ఇది ఇండియ‌న్ సినిమా రికార్డుల్ని మ‌రోసారి తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌నే అనుకున్నారంతా. అమీర్ ఖాన్ త‌న సినిమా 'పీకే' పేరిటే ఉన్న హైయెస్ట్ గ్రాస‌ర్ రికార్డును 'దంగల్'తో బద్దలు కొట్టేలాగే కనిపించాడు. ఫస్ట్ వీకెండ్లో మాత్రమే కాక.. వీక్ డేస్‌లో కూడా తిరుగులేని హవా సాగించిందా సినిమా. రెండో వారాంతంలో కూడా కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి.

ఐతే ఎంత జోరు చూపించినప్పటికీ 'దంగల్'.. 'పీకే' ఓవరాల్ కలెక్షన్లను దాటడం కష్టంగానే కనిపిస్తోంది. ఇండియా వరకు 'పీకే' వసూళ్లను ఎప్పుడో దాటేసింది 'దంగల్'. 'పీకే' దేశీయంగా రూ.345 కోట్లు వసూలు చేస్తే 'దంగల్' ప్రస్తుతం రూ.400 కోట్ల మార్కుకు చేరువగా ఉంది.

ఐతే విదేశాల్లో 'దంగల్'' మంచి వసూళ్లే రాబట్టింది కానీ.. 'పీకే' స్థాయిలో ప్రభంజనం సృష్టించలేకపోయింది. ప్రస్తుతం 'దంగల్' విదేశీ వసూళ్లు రూ.200 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.200 కోట్లతో సరిపెట్టుకోక తప్పదేమో. మొత్తంగా చూస్తే 'దంగల్' రూ.600 కోట్ల మార్కును దాటడం ఖాయం. 'భజరంగి భాయిజాన్' వసూళ్లను (రూ.625 కోట్లు) దాటి రెండో స్థానానికి చేరొచ్చేమో కానీ.. 'పీకే' వసూళ్లను (రూ.730 కోట్లు) అధిగమించడం ప్రస్తుతానికి కష్టమే.

ఐతే 'పీకే' సినిమాను కొంచెం లేటుగా చైనాలో రిలీజ్ చేయగా.. అక్కడ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలా 'దంగల్'ను కూడా రిలీజ్ చేసే ఆలోచన ఉందేమో అమీర్ ఖాన్‌కు. అలా అయితే 'పీకే' రికార్డుకు మూడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు