మహేష్ లాంచింగ్ కోసం పక్కా ప్లానింగ్

మహేష్ లాంచింగ్ కోసం పక్కా ప్లానింగ్

పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవడానికి గత కొన్నేళ్లలో గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చారు మన స్టార్ హీరోలు. ఆల్రెడీ అల్లు అర్జున్ కేరళలో స్టార్ హీరో అయిపోయాడు. 'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మారాడు. ఇప్పుడు మిగతా హీరోలు కూడా పొరుగు మార్కెట్లపై కన్నేస్తున్నారు. మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాతో తమిళనాట కొంచెం ఆదరణ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు మహేష్ చేస్తున్న మురుగదాస్ సినిమాతో అతడి దశ తిరిగిపోతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మురుగదాస్ తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ద్విభాషా చిత్రం అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా.. సూర్య సినిమాలు తెలుగు వాళ్లకు కనెక్టయినట్లు.. మహేష్ సినిమాను కూడా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు మురుగ.

మహేష్ సినిమాలో కీలకమైన పాత్రలు చాలా వరకు తమిళ నటులకే ఇచ్చాడు మురుగ. ఇందులో విలన్ పాత్రను ఎస్.జె.సూర్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో కీలక పాత్రకు 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్‌ను తీసుకున్నాడు మురుగ. తాజాగా కమెడియన్ ప్రేమ్ జీ అమరన్‌ (ఇళయరాజా తమ్ముడి కొడుకు)‌కు కూడా ఈ సినిమాలో ఓ పాత్ర ఇచ్చాడు మురుగ. తెలుగులో ప్రియదర్శి చేస్తున్న క్యారెక్టరే తమిళంలో ప్రేమ్ జీ చేస్తున్నాడు. తన కజిన్ వెంకట్ ప్రభు సినిమాలతో సూపర్ పాపులర్ అయిన ప్రేమ్ జీ.. వేరే సినిమాల్లో నటించడం అరుదు. ఐతే అతణ్ని మహేష్ సినిమా కోసం పట్టుకొచ్చాడు మురుగ.

ఈ సినిమాలో మరికొందరు తమిళ నటులు ఉంటారట. సంగీత దర్శకుడు.. టెక్నీషియన్లు కూడా తమిళులే కాబట్టి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. మొత్తానికి తమిళంలో మహేష్ బాబు ఫుల్ టైం లాంచింగ్ కోసం సన్నాహాలు బాగానే జరుగుతున్నాయన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు