పవన్ వెర్సస్ మహేష్.. ఎప్పుడంటే?

పవన్ వెర్సస్ మహేష్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి నిష్క్రమించాక నెంబర్ వన్ స్థానానికి ప్రధానంగా పోటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్యే నడిచింది. క్రేజ్ పరంగా చూసుకున్నా.. బాక్సాఫీస్ స్టామినా పరంగా చూసుకున్నా ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరు. ఐతే ఈ ఇద్దరు హీరోలు ఒకరి తర్వాత ఒకరు రికార్డులు బద్దలు కొట్టుకున్నారు కానీ.. ఒకేసారి బాక్సాఫీస్ సమరానికి దిగిన సందర్భాలు మాత్రం దాదాపుగా లేవు. సంక్రాంతికి చిరంజీవి.. బాలయ్యలు పోటీ పడ్డట్లు సూపర్ స్టార్లుగా ఎదిగాక పవన్-మహేష్ మధ్య పోటీ ఎన్నడూ చూడలేదు అభిమానులు. ఐతే ఈ ఏడాది ఈ రసవత్తర పోరు జరిగే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది దసరాకు పవన్-మహేష్ బాక్సాఫీస్ సమరం ఉండొచ్చని అంచనా. ఒకే రోజు కాకపోయినా.. కొన్ని రోజుల వ్యవధిలో దసరా సెలవుల్లో వీళ్లిద్దిరి సినిమాలు రిలీజయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పవన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ మార్చిలో విడుదలవుతుంది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న మూవీ ఏప్రిల్లో వచ్చే అవకాశముంది. ‘కాటమరాయుడు’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ చేయబోయే సినిమా.. కొరటాల దర్శకత్వంలో మహేష్ నటించే చిత్రం దాదాపుగా ఒకేసారి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఆరు నెలల్లో అవి రెండూ పూర్తయి దసరాకు బరిలో నిలవబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల టార్గెట్ అయితే దసరానే. ఒకవేళ షూటింగ్ షెడ్యూళ్లలో ఏమైనా తేడాలొచ్చి మార్పులొస్తే చెప్పలేం. అంతా అనుకున్నట్లు జరిగితే దసరాకు మహా సమరం గ్యారెంటీయేనన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు