నాగార్జున.. శర్వాను కూడా వదల్లేదు

నాగార్జున.. శర్వాను కూడా వదల్లేదు

ఇగోస్ ఏమీ లేకుండా అందరి హీరోల గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుంటాడు అక్కినేని నాగార్జున. దశాబ్దం విరామం తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ.. 'ఖైదీ నెంబర్ 150' సూపర్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ మూడు రోజుల కిందట ట్వీట్ చేశాడు నాగ్. ఆ తర్వాత బాలయ్యతో విభేదాలన్నీ కట్టిపెట్టేసి ఆయనకు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ.. 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి ట్వీట్ చేశాడు.

ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉన్న ఓ చిన్న సినిమా గురించి కూడా నాగ్ స్పందించాడు. కేవలం పెద్ద హీరోల గురించే కాకుండా శర్వానంద్‌ను కూడా గుర్తుపెట్టుకుని అతడి సినిమా గురించి ట్వీట్ చేశాడు నాగ్.

రెండు పెద్ద సినిమాల మధ్య 'శతమానం భవతి' లాంటి సినిమాను రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని.. గత ఏడాది కూడా ఇలాగే గట్స్ చూపించిన శర్వా విజయం సాధించాడని.. ఈసారి కూడా అలాగే సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు నాగ్. పోయినేడాది సంక్రాంతికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్‌లతో పాటు నాగ్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా' కూడా విడుదలవుతున్నప్పటికీ శర్వానంద్ సినిమా 'ఎక్స్‌ప్రెస్ రాజా'ను ధైర్యంగా రిలీజ్ చేశారు. అంత పోటీలోనూ ఆ సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడు 'శతమానం భవతి'ని కూడా ధైర్యంగా సంక్రాంతి రేసులో నిలబెట్టేశారు.

ఈ సినిమా పాజిటివ్ బజ్ మధ్య శుక్రవారం  రిలీజవుతోంది. మరి సంక్రాంతి రేసులో ఉన్న మూడు సినిమాలకు విషెస్ చెప్పిన నాగ్.. నారాయణమూర్తి సినిమా 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' గురించి ఏం ట్వీట్ చేయడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు