అభిమానాన్ని అమ్ముకోనంటున్న చిరు

అభిమానాన్ని అమ్ముకోనంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీగా ‘కత్తి’ రీమేక్‌ను ఎంచుకున్నాడనగానే జనాల్లో ఒకరకమైన సందేహాలు రేకెత్తాయి. విఫల రాజకీయ నేతగా ముద్ర వేసుకున్న చిరు.. రైతుల కోసం ఉద్యమించే వ్యక్తిగా కనిపిస్తే జనాలు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానాలు కలిగాయి. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’లో ఈ విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు చిరు. ప్రభుత్వాల మీద భారీగా సెటైర్లు వేసేయడం.. తానేదో గొప్పవాడి లాగా ప్రెజెంట్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు చిరు. ఇక రాజకీయంగా తన మీద తాను ఒక సెటైర్ కూడా వేసుకుని.. తనను ఎద్దేవా చేసేవాళ్లకు కూడా చిరు సెటైర్లు వేయడం విశేషం.

ప్రి క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా సాగే ఒక సన్నివేశంలో చిరు.. ‘‘అభిమానాన్ని అమ్ముకునే వాడిని కాదు’’ అంటాడు. రాజకీయంగా తాను నమ్మకం నిలబెట్టలేకపోయినప్పటికీ తన స్వార్థం కోసం అభిమానాన్ని మాత్రం వాడుకోలేదు అన్న ఉద్దేశం ఈ డైలాగ్‌లో కనిపిస్తుంది. ‘‘నవ్విన వాళ్లే ఏడ్చే రోజు వస్తుంది’’ అనడం ద్వారా తనను ఎద్దేవా చేసే వాళ్లు చింతించే రోజు వస్తుందని హెచ్చరించాడు. ఇక గల్లీ నుంచి దిల్లీ రాజకీయాలు చూసి.. దెబ్బలు తిని తట్టుకున్న వాడిని అనే డైలాగ్ కూడా చిరు రాజకీయ జీవితాన్ని ప్రతిబింబించేదే.

ఇది చిరు తన మీద తాను వేసుకున్న సెటైర్ అని కూడా అనుకోవచ్చు. ఈ డైలాగులలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటి కంటే కూడా రైతుల సమస్యల మీద రాసిన డైలాగులు సినిమాలో బాగా హైలైట్ అయ్యాయి. పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ బుర్రా, వేమారెడ్డి ఈ చిత్రానికి మాటలు రాశారు. చిరు నోట వినిపించిన పొలిటికల్ డైలాగులు చాలా వరకు పరుచూరి వారు రాసినవే అని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు