నలుగురు భార్యలున్నవారితోనే స‌మ‌స్య‌

నలుగురు భార్యలున్నవారితోనే స‌మ‌స్య‌

భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెరుగుదలకు ముస్లింలే కారణమని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో జనాభా పెరుగుదలకు నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు ఉన్నవారే బాధ్యులు. జనాభా పెరుగుదలకు హిందువులు కారణం కాదు’ అని ‘సంత్ సమ్మేళన్’లో మాట్లాడుతూ సాక్షిమహారాజ్‌ అన్నారు.

‘జనాభా పెరుగుదలను నిజంగా నియంత్రించాలని మనం కోరుకుంటే ఈ దేశంలో కఠినమైన చట్టాలను తీసుకురావలసిన అవసరం ఉంది. పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది’ అని ఉన్నావో నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సాక్షి మహరాజ్ అన్నారు.

సాక్షి మహరాజ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శల వర్షం కురిసింది. ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఒక నివేదిక పంపించాలని ఎన్నికల కమిషన్ మీరట్ జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. స్థానిక పోలీసులు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి మహరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎవరు కూడా మతం, కులం పేరిట ఓట్లు అడగకూడదని, అలా చేస్తే అది అవినీతికి పాల్పడినట్టేనని అత్యున్నత న్యాయస్థానం విస్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సాక్షి మహరాజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాజకీయాలకోసం మతాన్ని ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ నాయకులు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని జనతాదళ్ (యునైటెడ్) నేత కెసి త్యాగి విమర్శించారు. అందువల్ల సాక్షి మహరాజ్‌పై బీజేపీతో పాటు ఎన్నికల సంఘం తప్పనిసరిగా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సాక్షి మహరాజ్ కుల, మతపరమైన వ్యాఖ్యలు చేసినందున ఆయన నేరానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత కేసీ మిట్టల్ అన్నారు. సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యల గురించి బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వద్ద ప్రస్తావించగా, ఆయన ప్రకటనను తాను చూడలేదని, అయితే చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు.. బీజేపీవి కాని, ప్రభుత్వానివి కాని కావని నక్వీ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు