వన్ అండ్ ఓన్లీ రాజు!

వన్ అండ్ ఓన్లీ రాజు!

బి.ఏ.రాజు... ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉంటారేమో కానీ ఈ పేరు వినని తెలుగు సినిమా వాళ్లంటూ ఉండరు. మీడియా అంటే తెలుగు సినీ పరిశ్రమలో ముందుగా గుర్తొచ్చేది ఆయనే. పబ్లిసిటీ అనగానే ఏ కళ్లయినా వెతికేది ఆయన కోసమే. తెల్లవారు లేచింది మొదలు ఊళ్లో షూటింగ్ జరుపుకుంటోన్న అన్ని సినిమాల సెట్స్‌లోను ఆయన పలకరింపు వినిపిస్తుంది. ఇండస్ట్రీలో జరిగే ప్రతి మంచి, చెడు ఆయనకే ముందుగా చేరుతుంది.

సినిమానే శ్వాసిస్తూ, సినిమానే పూజిస్తూ, సినిమానే లోకంగా జీవించే బి.ఏ. రాజు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది సూపర్‌స్టార్ కృష్ణ అభిమానిగానే అయినా కొంత కాలంలోనే అందరివాడు అనిపించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటేనే నెగెటివిటీ రాజ్యమేలుతుంది. పక్కవాడు పడిపోతే ఆనందించే రంగాల్లో ఇదే ముందుంటుంది. కానీ రాజు నోట ఏ సినిమా గురించీ ఎప్పుడూ ఒక్క నెగెటివ్ కామెంట్ అంటూ వినిపించదు. తను పీఆర్వోగా చేసిన సినిమాలనే కాదు, ఇతరుల చిత్రాలని కూడా ఆయన పల్లెత్తు మాటనడు. ఫ్లాప్ సినిమాల్లోను పాజిటివ్‌లు వెతికే ఆయనలాంటి వాళ్లు పక్కనుంటే పడిపోయిన వాడు కూడా మళ్లీ లేచి కదం తొక్కుతాడు.

సినీ మీడియా అంటే సరదా పడి వచ్చిన యువతరానికి ఆయనో దిక్సూచిలా నిలుస్తాడు. ఇక్కడ ఎలా ఉంటే రాణిస్తారనే దానికి ఆయన నడిచే పుస్తకంలా కనిపిస్తాడు. ఒక రెండు ప్రెస్మీట్లు అటెండ్ అయిన ఏ కుర్రాడికైనా ఈ రంగంలో మనం చేరుకోవాల్సిన శిఖరం ఆయనే అనిపిస్తాడంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చి పెన్నూ, పుస్తకం పట్టుకుని బెరుకు, బెరుకుగా కదులుతోన్న యువ జర్నలిస్టు భుజం తట్టి ప్రోత్సహించడంలో ముందుంటాడు. సినీ జర్నలిజంలోకి వచ్చిన అందరినీ తన కుటుంబ సభ్యులన్నట్టు సమానంగా ట్రీట్ చేస్తాడు.

ఇండస్ట్రీలో జరిగే మంచికి మైక్ ఇచ్చి మోగించడానికి ముందుండే బి.ఏ. రాజు, తన చెవిన పడిన చెడుకి తన నోరు దారెటో కూడా తెలియనివ్వడు. బి.ఏ. రాజే కనుక న్యూస్ బ్రేక్ చేయాలనుకున్నా, పరిశ్రమలోని గాసిప్స్‌ని పబ్లిష్ చేసినా రన్నింగ్‌లో ఉన్న సినిమా వెబ్‌సైట్స్ అన్నీ బిక్క మొహం వేసుకోక తప్పదు. అంత ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసుకోవడానికి ఆయన అస్సలు ప్రయత్నించడు. ఒక సగటు సినీ అభిమానిగా ప్రస్థానం ప్రారంభించి, జర్నలిస్టుగా, పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా ఎదిగిన బి.ఏ. రాజు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయనకున్న ఓర్పు, సహనం, పదిమందితో అల్లుకుపోయే తత్వం, వంద మందిని ఒక్కసారే మెప్పించగల గుణం అంత తేలిగ్గా రావు. అందుకే ఆయనతో సఖ్యత లేని ఫ్యామిలీ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో కానరాదు.

అసలు వార్తల వరకూ ఎందుకు? బి.ఏ. రాజు రిక్వెస్ట్ చేస్తే ఏ హీరో అయినా డేట్స్ ఇస్తాడు. రాజుకి సినిమా చేసిపెట్టడం ఆబ్లిగేషన్ కాదు, మన రెస్పాన్సిబులిటీ అనుకుంటారు. అయినప్పటికీ రాజు ఎప్పుడూ తన గుడ్విల్ని వాడుకుని ఎరుగడు. తన అభిరుచికి తగ్గట్టు సినిమాలు నిర్మిస్తూ చిన్న సినిమాలతోనే సంతృప్తి చెందుతారే తప్ప పరిచయాలతో నిచ్చెన ఎక్కాలని చూడడు. ఆయనని దగ్గరగా చూసిన అందరికీ ఆయనలా ఉండాలని అనిపిస్తుంది కానీ, ఆ వ్యక్తిత్వం, ఆ పద్ధతి, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత అలవడడం అంత తేలిక కాదు. పీఆర్వోలుగా చేసిన వారికంటూ ఒక గిన్నిస్ బుక్ లాంటిదొకటి ఉంటే దానికి కవర్‌పేజీ రాజుదే అవ్వాలి. వెయ్యికి పైగా సినిమాలకి ప్రచార కర్తగా వ్యవహరించడం అనేది ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు, ఇకపై జరగకపోవచ్చు. ఆ ఘనతకి బి.ఏ. రాజే వన్ అండ్ ఓన్లీ.

వైశాఖం అనే ఒక చక్కని ఫీల్‌గుడ్ సినిమాతో త్వరలోనే నిర్మాతగా మరోసారి మన ముందుకి రాబోతున్న బి.ఏ. రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి బెస్ట్ విషెస్ చెబుతూ, సంచలనాలు చేసిన పెళ్లిచూపులు లాంటి విజయం వైశాఖంని వరించాలని కోరుకుంటోంది గుల్టీ.కామ్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు