ట్రంప్ వార్నింగ్.. నిషేధం ఎత్తేసిన భార‌త్

క‌రోనా వైర‌స్‌కు ఉన్నంతలో మెరుగ్గా ప‌ని చేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (మ‌లేరియాకు వాడే మందు) ఔష‌ధాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌న్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్న‌పాన్ని భార‌త్ మ‌న్నించింది. అమెరికాతో పాటు అవసరమైన ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దిశ‌గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఎత్తివేసింది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనాకు ఇప్పటి వరకు చికిత్సంటూ ఏమీ లేదు. నాలుగు నెల‌ల కింద‌టే బ‌య‌ట‌ప‌డ్డ నావెల్ క‌రోనాకు వ్యాక్సిన్ కూడా క‌నుగొన‌లేదు. ఐతే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంత‌లో క‌రోనాకు బాగా ప‌నిచేస్తోంద‌ని ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది. దీంతో ఈ ఔష‌ధానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. భారత్ అవసరాలకు సరిపడేంత మందుతోపాటు అద‌నంగా నిల్వ‌లు ఉండ‌టంతో ఆ మేర‌కు ఎగుమతి చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

ముందు ఈ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ సుముఖంగా లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ స‌హా కొన్ని ఔష‌ధాల ఎగుమ‌తుల‌పై నిషేధం ఉంది. అయితే ఈ క‌ష్ట కాలంలో భార‌త్ త‌మ విన్న‌పాన్ని ఆలకించకపోతే గట్టి చర్యలు ఉంటాయని, దానికి ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని ట్రంప్ హెచ్చ‌రించాడు. ట్రంప్ హెచ్చరికల సంగతెలా ఉన్నా.. క‌రోనా ధాటికి అల్లాడుతున్న దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేయాలని ముందే ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.