బాలీవుడ్ నట దిగ్గజం ఓంపురి ఇక లేరు

బాలీవుడ్ నట దిగ్గజం ఓంపురి ఇక లేరు

కొత్త సంవత్సరం మొదలై సరిగ్గా ఐదు రోజులే అయ్యాయి. ఆనందోత్సాహాల మధ్య మొదలైన సంవత్సరం మొదట్లోనే బెంగళూరులో అమ్మాయిల మీద జరిగిన మృగాళ్ల దాడి షాకింగ్ నుంచి కోలుకుంటున్న వారికి మరో విషాదాన్ని కమ్మేసింది. బాలీవుడ్ నట దిగ్గజం.. పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసినట్లుగా నటించే ఓంపురి (66) ఇక లేరు.  ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున చిత్రాల్లో నటించిన ఓంపురిని నట దిగ్గజంగా వ్యవహరిస్తారు.

తన నటనతోపాత్రలకు ప్రాణం పోసే ఓంపురి ఈ రోజు ఉదయం ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణం బాలీవుడ్ తో పాటు.. సినీరంగ అభిమానులకు షాకింగ్ గా మారింది. హిందీ.. ఇంగ్లిష్.. మరాఠీ.. కన్నడ.. పంజాబీ.. ఉర్దూతోపాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయనఇక లేరన్న వార్త అభిమానుల్ని కలిచివేస్తోంది.

ఓంపురి మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేస్తోందని.. షాకింగ్ కు గురి చేసిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 1950 అక్టోబర్ 18న హర్యానాలోని అంబాలాలో జన్మించిన ఆయన.. ప్రస్తుతం ముంబయిలోని అంథేరీలో నివాసం ఉంటున్నారు.

పద్మశ్రీ పురస్కారంతో పాటు.. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 8సార్లు ఫిలింఫేర్ అవార్డుల్ని సాధించిన ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆయన 1993లో నందిత పురిని వివాహమాడారు. అనంతరం 2013లో విడాకులు తీసుకున్నారు. 1976లో మరాఠీ చిత్రం ఘాశీరామ్ తో సినీ రంగప్రవేశం చేసిన ఆయన.. ప్రస్తుతం రెండు కన్నడ చిత్రాల్లోనూ.. ఒక ఇంగ్లిష్.. పాకిస్థానీ చిత్రంలో నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు