పీవీపీతో గొడవ.. వంశీ స్పందించాడు

పీవీపీతో గొడవ.. వంశీ స్పందించాడు

గత వారం రోజులుగా టాలీవుడ్లో ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనదగ్గ పొట్లూరి వరప్రసాద్.. తన ప్రొడక్షన్లో మెమొరబుల్ సినిమాగా చెప్పుకున్న 'ఊపిరి'కి సంబంధించి రూ.20 కోట్ల నష్టం వచ్చిందని.. తన ప్రొడక్షన్లోనే తర్వాతి సినిమాను చేయని పక్షంలో ఆ 20 కోట్లు కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ కేసు వేయడం.. మహేష్‌తో వంశీ చేయాల్సిన సినిమాను ఆపాలంటూ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం సంచలనం రేపింది.

ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నా వంశీ మౌనంగా ఉండిపోయాడు. మధ్యలో సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతడి వైపు నుంచి ప్రయత్నాలు జరిగాయట కానీ.. అవేమీ ఫలితాన్నివ్వలేదు.

దీంతో వంశీ మౌనం వీడాడు. తన వెర్షన్ వినిపించాడు. 'ఊపిరి' సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు వంశీ. ఈ సినిమాకు రూ.20 కోట్లకు పైగా నష్టం వచ్చిందన్న ప్రచారం వాస్తవం కాదన్నాడు. శాటిలైట్ హక్కులతో కలిపి 'ఊపిరి'కి లాభాలు వచ్చాయని అతను తెలిపాడు. పీవీపీ వేసిన కేసుల్ని తాను న్యాయ పరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశాడు. వంశీ అడ్డం తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ గొడవ వల్ల తన షెడ్యూళ్లు దెబ్బ తినేలా ఉండటంతో మహేష్ బాబు ఏం చేయబోతున్నాడన్నదీ ఆసక్తి రేకెత్తించేదే. ఆల్రెడీ మహేష్ ఈ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పీవీపీ ఏమీ తగ్గట్లేదని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు