నాగార్జున ఆ మైలురాయిని దాటేశాడు

నాగార్జున ఆ మైలురాయిని దాటేశాడు

రెండేళ్లు వెనక్కి వెళ్తే అక్కినేని నాగార్జున కెరీర్ చాలా అయోమయ స్థితిలో ఉండేది. ఢమరుకం, గ్రీకు వీరుడు, భాయ్ లాంటి వరుస డిజాస్టర్లతో హీరోగా బాగా వెనుకబడిపోయాడు నాగ్. కుర్ర హీరోల నడుమ నాగ్ లాంటి సీనియర్ హీరోలు తట్టుకోవడం కష్టమని తేల్చేశారు. నాగ్ కెరీర్ చరమాంకానికి వచ్చేసిందని తీర్మానించేశారు. అలాంటి సమయంలో అక్కినేని హీరో రైజ్ అయిన తీరు అసాధారణం.

మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి లాంటి సినిమాలతో కుర్ర హీరోలు కూడా తనముందు దిగదుడుపే అని రుజువు చేశాడు. ఈ తరం యువతలోనూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. సోషల్ మీడియాలో కూడా ఆయన జోరు మామూలుగా లేదు.

ట్విట్టర్లో ఏ సీనియర్ తెలుగు హీరోకు లేని ఫాలోయింగ్ నాగార్జునకు ఉంది. ఆ మాటకొస్తే యువ కథానాయకులు కూడా చాలామంది ఆయన వెనుకే ఉన్నారు. ట్విట్టర్లో నాగ్ 2 మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. తెలుగు హీరోల్లో మహేష్ బాబు (2.7 మిలియిన్), రానా దగ్గుబాటి (2.2 మిలియన్) మాత్రమే నాగ్ కంటే ముందుండటం విశేషం. దీన్ని బట్టే నాగార్జున ఈ తరం యూత్ కు కూడా ఏ స్థాయిలో కనెక్టయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక హీరోయిన్లలో సమంత.. త్రిష లాంటి వాళ్లు 3 మిలియన్ క్లబ్బులో ఉన్నారు. దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి 2.5 మిలియన్ ఫాలోవర్లతో ఉండగా.. వర్మ 2.3 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు.