అమీర్ సినిమా.. దిమ్మదిరిగిపోతోంది

అమీర్ సినిమా.. దిమ్మదిరిగిపోతోంది

కంటెంట్ పరంగా అయినా.. కలెక్షన్ల విషయంలో అయినా ఇండియాలో అమీర్ ఖాన్‌ సినిమాలకు సాటి వచ్చే మూవీస్ ఇంకేవీ కనిపించట్లేదు. రెండేళ్ల కిందట 'పీకే' సినిమాతో అమీర్ ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. అందులో మేజర్ క్రెడిట్ రాజ్ కుమార్ హిరానికి కూడా దక్కుతుందనుకోండి.

కానీ ఇప్పుడు నితీశ్ తివారి లాంటి పెద్దగా పేరు లేని దర్శకుడితో 'దంగల్' సినిమా చేసి కూడా అమీర్ ఖాన్ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తున్నాడు. తొలి వీకెండ్లోనే ఇండియాలో వంద కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన 'దంగల్' రెండో వీకెండ్లోనూ తన పట్టును కొనసాగిస్తూ.. అనూహ్యమైన వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో మూడు రోజుల్లో ఏకంగా రూ.73 కోట్లు కొల్లగొట్టి కొత్త చరిత్రను లిఖించింది 'దంగల్'.

ఇండియాలో సెకండ్ వీకెండ్లో శుక్రవారం రూ.18.6 కోట్లు.. శనివారం రూ.23 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఆదివారం ఏకంగా రూ.31 కోట్లు కొల్లగొట్టి ప్రకంపనలు రేపింది. రెండో ఆదివారం 30 కోట్లకు పైగా వసూలు చేయడం ఇప్పటిదాకా ఏ చిత్రానికీ సాధ్యం కాలేదు. ఇండియాలో ఆదివారం నాటికే ఈ చిత్రం రూ.270 కోట్లు వసూలు చేయడం విశేషం. మరోవైపు ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఇప్పటికే రూ.140 కోట్ల దాకా వసూలు చేసింది.

'దంగల్' రూ.500 కోట్ల మార్కును అందుకోవడం లాంఛనం లాగే కనిపిస్తోంది. అంతే కాదు.. 'పీకే' రికార్డుల్ని కూడా 'దంగల్' దాటేయడం ఖాయమే. ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.730 కోట్ల దాకా వసూలు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు