పీవీపీకి దర్శకులు వందల కోట్లలో బాకీ పడ్డట్లే

పీవీపీకి దర్శకులు వందల కోట్లలో బాకీ పడ్డట్లే

'ఊపిరి' సినిమా మొదలైనపుడు.. షూటింగ్ జరుగుతున్నపుడు.. సినిమా విడుదలకు ముందు.. తర్వాత పొట్లూరి వరప్రసాద్-వంశీ పైడిపల్లి ఎంత సన్నిహితంగా మెలిగారో అందరికీ తెలుసు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. పీవీపీ అయితే వంశీని ఓ రేంజిలో పొగిడాడు. తమ సంస్థకు మరపురాని చిత్రం అందించాంటూ వంశీని ప్రశంసించాడు. సినిమా సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకున్నాడు.

'బ్రహ్మోత్సవం' విడుదలకు ముందు ప్రమోషన్లలో కూడా 'ఊపిరి' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్రానికి రూ.20 కోట్ల నష్టం వచ్చిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా వెంటనే తనతో ఇంకో సినిమా చేయనందుకు వంశీ ఆ 20 కోట్ల నష్టాన్ని భరించాలనడం మరింత విడ్డూరం.

ఈ లెక్కల పీవీపీ తీసిన డిజాస్టర్ల లిస్టు తీస్తే.. ఆయనకు దర్శకులు వందల కోట్లలో బాకీ పడ్డట్లే. 'ఊపిరి' తర్వాత పీవీపీ బేనర్ నుంచి వచ్చిన 'బ్రహ్మోత్సవం' రూ.85 కోట్ల దాకా బిజినెస్ చేసింది. వసూళ్లు రూ.35 కోట్లకే పరిమితమయ్యాయి. అంటే ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పీవీపీకి రూ.50 కోట్లు కట్టాలన్నమాట. పీవీపీ నుంచి వచ్చిన ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ 'వర్ణ' రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ చిత్రం రెండు భాషల్లో కలిపి రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేదు. కాబట్టి సెల్వ రాఘవన్ కట్టాల్సిన మొత్తం రూ.40 కోట్లకు పైనే.

'సైజ్ జీరో' సినిమాకు గాను పీవీపీకి మిగిల్చిన నష్టానికి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కూడా ఓ 20 కోట్ల దాకా కట్టాలేమో. ఇంకా 'వీడింతే' దర్శకుడు సుశీంద్రన్.. బెంగళూరు నాట్కల్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా పీవీపీకి భారీగా బాకీ పడ్డట్లే. మరి పీవీపీ వీళ్లందరి నుంచి కూడా నష్టాల్ని రికవర్ చేస్తాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు