అతడి రుణం తీర్చుకోబోతున్న శర్వా

అతడి రుణం తీర్చుకోబోతున్న శర్వా

శర్వానంద్ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది.. జనాల దృష్టిని ఆకర్షించింది 'వెన్నెల' సినిమాతోనే. అంతకుముందు ఏ ప్రత్యేకతా లేని సహాయ పాత్రలు చేస్తుండేవాడతను. శర్వాను అప్పుడందరూ లైట్ తీసుకునేవాళ్లు. కానీ 'వెన్నెల' సినిమాలో సైకో తరహా పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ కూడా తనవైపు చూసేలా చేసుకున్నాడు.

ఆ తర్వాత 'ప్రస్థానం' సినిమాతో కథానాయకుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు. శర్వా కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ రెండు సినిమాలకూ దర్శకుడు దేవా కట్టా. ఇప్పుడా దర్శకుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆటోనగర్ సూర్య, డైనమైట్ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపవడంతో అవకాశాల్లేక కొట్టుమిట్టాడుతున్నాడు దేవా.

తనను నటుడిగా.. హీరోగా నిలబెట్టిన దేవాకు ఇప్పుడు తోడ్పాటు అందించాలనుకుంటున్నాడు శర్వా. ఈ ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని సమాచారం. ఇటీవలే ఓ కథ చెప్పి శర్వాతో ఓకే చేయించుకున్నాడట దేవా. హ్యాట్రిక్ హిట్లు కొట్టిన శర్వా.. ఈ సంక్రాంతికి 'శతమానం భవతి'తోనూ మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.

ఇలాంటి స్థితిలో ఫ్లాప్ డైరెక్టర్‌గా ముద్ర పడిన దేవాతో చేయడం రిస్కే. అయినప్పటికీ తనకు దేవా చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని.. అతడి టాలెంట్ మీద నమ్మకంతో తనతో సినిమా చేయడానికే రెడీ అవుతున్నాడు శర్వా. మరి ఈ అవకాశాన్ని దేవా ఎంతమేరకు సద్వినియోగం చేసకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు