శర్వా పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

కొడితే వరుస హిట్లు కొడతాడు.. లేదంటే వరుసగా డిజాస్టర్లు ఇస్తాడు.. ఇదీ యువ కథానాయకుడు శర్వానంద్ పరిస్థితి. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలతో ఒక దశలో శర్వానంద్ మాంచి ఊపులో ఉన్నాడు. అతడి మార్కెట్ రూ.30 కోట్ల మార్కును దాటింది. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా.. ‘మహానుభావుడు’తో మళ్లీ అతను మంచి విజయాన్నందుకున్నాడు. ఈ క్రమంలో శర్వాతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. ఆ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించి ఉంటే శర్వా ఇప్పుడు పెద్ద రేంజిలో ఉండేవాడే. కానీ గత రెండున్నరేళ్లలో శర్వా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుసగా అతతడి సినిమాలన్నీ డిజాస్టర్లవుతున్నాయి. 2018 చివర్లో విడుదలైన ‘పడి పడి లేచె మనసు’ శర్వా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది.

తర్వాత అతడి నుంచి వచ్చిన ‘రణరంగం’కు కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది. ఇక గత ఏడాది విడుదలైన ‘జాను’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘శ్రీకారం’ అయినా అతడిని పరాజయాల బాట నుంచి బయట పడేస్తుందని అనుకుంటే.. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. శర్వా కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బయ్యర్ల పెట్టుబడిలో ఈ సినిమా సగం మాత్రమే వెనక్కి తేగలిగింది. చిన్న సినిమా అనుకున్న ‘జాతిరత్నాలు’.. ‘శ్రీకారం’ను పెద్ద దెబ్బే కొట్టింది.

శర్వా చేసిన చివరి నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అవేవీ కూడా చెత్త సినిమాలు అనడానికి వీల్లేదు. మంచి అభిరుచి ఉన్న దర్శకులతోనే అతను సినిమాలు చేశాడు. విభిన్నమైన కథలనే ఎంచుకున్నాడు. అన్ని సినిమాలకూ ప్రి రిలీజ్ బజ్ బాగానే కనిపించింది. ఆయా సినిమాల ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. శర్వాకు ఈసారి హిట్టు ఖాయం అన్న ఫీలింగే కలిగించింది ప్రతి సినిమా కూడా. కానీ ఏదీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. వరుసగా నాలుగు డిజాస్టర్లంటే ఏ హీరోకైనా ఇబ్బందే. ఐతే శర్వా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్టులు అతడి తలుపు తడుతున్నాయి. ఈ ఏడాది అతను మరో మూడు చిత్రాలతో పలకరించనున్నాడు. అందులో ‘మహాసముద్రం’ లాంటి క్రేజీ ప్రాజెక్టు కూడా ఉంది. అతడి నెక్స్ట్ రిలీజ్ కూడా ఇదే. మరి ఈ సినిమాతోనైనా శర్వా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.