2016: శ్రీనివాసరెడ్డి ఒక్కడే..

2016: శ్రీనివాసరెడ్డి ఒక్కడే..

కమెడియన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించగానే.. హీరో అయిపోవాలన్న ఆశ పుట్టడం సహజం. ఇలా గతంలో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఏడాది కొందరు కమెడియన్లు కొత్తగా హీరోలయ్యారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది సప్తగిరి గురించే. అతను కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ 'కాటమరాయుడు'.

దాన్ని పవన్ కళ్యాణ్ అడిగాడని ఇచ్చేశారు. ఆ కృతజ్నతతో పవన్ ఆడియో వేడుకకు రావడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. కానీ ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. హీరోగా సప్తగిరి విజయం మాత్రం దక్కలేదు.


మరోవైపు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఈ మధ్యే స్టార్ కమెడియన్ స్టేటస్ సంపాదించిన పృథ్వీ కూడా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో హీరో తరహా పాత్ర చేశాడు. అతడికీ చేదు అనుభవమే మిగిలింది. ఇక కామెడీ రోల్స్ వదిలేసి హీరో పాత్రలకే పరిమితం అయిపోయిన సునీల్.. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో (కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే) పలకరించాడు. ఆ మూడూ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపై హీరోగా అతడి ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి.

మొత్తంగా హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వీళ్లందరికీ చేదు అనుభవాలే మిగిలాయి. ఐతే మరో కమెడియన్ శ్రీనివాసరెడ్డి నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. అందరి ప్రశంసలందుకుందీ చిత్రం. కమెడియన్లు హీరోలుగా చేయదలుచుకుంటే ఎలాంటి సినిమాలు చేయాలో ఒక ఉదాహరణగా నిలిచిందీ సినిమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు