‘కొత్త నీరు’ తేవటం వెనుక జగన్ అసలు వ్యూహం ఇదేనా?

మారే కాలానికి తగ్గట్లు రాజకీయ వ్యూహాల్ని అమలు చేయటం ద్వారా ప్రజల ఆదరాభిమానాల్ని.. అధికారాన్ని చేజిక్కించుకునే సరికొత్త ఎత్తుగడను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారా? అంటే అవునని చెప్పాలి. గడిచిన కొద్ది కాలంగా మారుతున్నరాజకీయాల్ని నిశితంగా గమనిస్తున్న ఆయన.. రొడ్డు కొట్టుడు నిర్ణయాల్ని పక్కన పెట్టేసి.. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే వాటిని రియల్ గా చేసి చూపిస్తున్నారు.

కూరగాయలు అమ్మే వ్యక్తి మున్సిపల్ ఛైర్మన్ కావటం ఏమిటి? ఒంటరిగా ఉంటూ పిల్లలకు ట్యూషన్లు చెప్పే టీచరమ్మ నగర ప్రథమ పౌరురాలు కావటం ఏమిటి? ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని సామాన్యులకు ఏకంగా అధికారాన్ని చేతికి ఇచ్చేయటం ఏమిటి? డబ్బు బలం ఏమీ లేకున్నా.. పవర్ ఉండే పదవులకు ఎందుకు ఎంపిక చేస్తున్నట్లు? అన్నదిప్పుడు చర్చగా మారింది.

ముందుచూపుతోనే వైఎస్ జగన్ సరికొత్త రాజకీయానికి తెర తీశారని చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయాల్లో విధేయత అన్నది నేతిబీర చందంగా మారింది. రాజకీయాల్లో ఆటుపోట్లు తిన్న వారికి.. ఎప్పుడెలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు. తన ఎదుగుదల మాత్రమే చూసుకోవటమే తప్పించి.. విధేయత అన్నది తన అవసరానికి తగ్గట్లుగా మార్చుకోవటం ఎక్కువైంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పే పని షురూ చేశారు జగన్.

ఆ మధ్యన మంత్రిగా అవకాశం ఇచ్చిన సీదర అప్పలరాజు ఉదంతమే దీనికి నిదర్శనం. 40 ఏళ్ల వయసున్న ఈ ఎమ్మెల్యే..తొలిసారి ప్రజాప్రతినిధిగా గెలిచారు. అలాంటి వ్యక్తిని మంత్రిగా చేయటం ద్వారా.. జీవితాంతం తనకు విధేయుడిగా మార్చేసుకున్నారు జగన్. కలలో కూడా ఊహించని విధంగా మంత్రి పదవిని సొంతం చేసుకున్న అతడికి.. అమాత్య పదవిని ఇవ్వటం వెనుక అసలు ఎత్తుగడ వేరేగా ఉందని చెప్పాలి. పలుకుబడి.. ధనబలం ఉన్న వారికి మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా.. ఇవాళ ఇక్కడ ఉంటే.. రేపొద్దున అధికారం చేతిలో ఉన్న పార్టీలోకి మారతారు. అలా కాకుండా యువతను..కొత్త రక్తానికి అవకాశం ఇవ్వటం ద్వారా.. వారు పార్టీకి విధేయులుగా మారిపోతారు.

అన్నింటికి మించి.. ఇలాంటి వారు ఎంత ఎక్కువగా ఉంటే.. ముఖ్యమంత్రిగా జగన్ అంత ఎక్కువగా ఫోకస్ అవుతారు. అంతేకాదు.. సామాన్య.. మధ్యతరగతి వర్గాలకు అధికారాన్ని ఇవ్వటం ద్వారా.. ప్రజల్లో కొత్త రాజకీయాన్ని.. కొత్త మార్పును చూశామన్న భావన కలుగుతుంది. కొత్తగా పదవిని చేపట్టేవారు తొందరపడి అవినీతికి పాల్పడలేరు. వారిని కంట్రోల్ చేయటం చాలా తేలిక. అదే సమయంలో వారి కారణంగా తప్పులు జరిగినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోరు. రాజకీయాలు కొత్తగా వచ్చిన వారిని ఇట్టే క్షమిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త నాయకత్వాల్ని పెంచి పోషించటం ద్వారా.. బలమైన విధేయ వర్గాల్ని తయారు చేసుకున్నట్లు అవుతుంది. రానున్న రోజుల్లో పార్టీకి ఇదో వరంలా మారుతుంది. ఇదే జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే.. కొత్త నీటికి స్వాగతం పలుకుతున్నారని చెప్పక తప్పదు.