నారా.. ఇక ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్

నారా.. ఇక ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్

టాలీవుడ్లో శరవేగంగా సినిమాలు చేసే హీరోల్లో నారా రోహిత్ పేరు ముందు చెప్పుకోవాలి. ఈ ఏడాది రెండు.. మూడు కాదు.. ఏకంగా ఆరో సినిమా విడుదలకు రెడీ అయిపోతున్నాడు రోహిత్. సమ్మర్లో తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే సినిమాలు రిలీజయ్యాయి. తర్వాత జ్యో అచ్యుతానంద.. శంకర సినిమాలతో పలకరించాడు. ఇప్పుడు ఏడాది చివర్లో 'అప్పట్లో ఒకడుండేవాడు' రిలీజవుతోంది. ఈ చిత్రానికి రోహిత్ హీరో మాత్రమే కాదు.. నిర్మాణ భాగస్వామి కూడా. 'అసుర' దర్శకుడు కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు రోహిత్. ఐతే ఏదో నామమాత్రంగా ఒక సినిమా తీసి ఆపేయబోనని.. వచ్చే ఏడాది వరుసగా సినిమాలు చేస్తానని అంటున్నాడు రోహిత్.

''మా అరన్ మీడియా వర్క్స్ బేనర్ మీద వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మిస్తాం. బయటి వాళ్లతో కూడా సినిమాలు చేసే ఉద్దేశం ఉంది. ప్రొడక్షన్లో చేసే తొలి సినిమా ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి వైవిధ్యమైన కథను ఎంచుకున్నాను. సినిమా పూర్తయ్యాక చాలా సంతృప్తి కలిగింది. ఇది చాలా పెద్ద కథ. నక్సలిజం.. గ్లోబలైజేషన్.. క్రికెట్.. ఇలా అనేక అంశాల ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి కథను రెండు గంటల్లో చెప్పడం అన్నది సవాలే. దర్శకుడు సాగర్ చంద్ర ఆ పనిని సమర్థంగా నిర్వర్తించాడు. సినిమా పూర్తయ్యాక కానీ తెలియలేదు ఇలాంటి చిత్రం పూర్తి చేయడం ఎంత కష్టమో. నా కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది'' అని రోహిత్ తెలిపాడు.