ఇక వర్మ ఏ స్టేట్మెంట్ ఇవ్వడట

ఇక వర్మ ఏ స్టేట్మెంట్ ఇవ్వడట

కంటెంట్ అంతంతమాత్రమే అయినా.. వివాదాల పుణ్యమా అని 'వంగవీటి' బాగానే కాసులు తెచ్చుకుంది. తొలి రోజు సినిమా చూసిన ప్రేక్షకులందరూ పెదవి విరవడంతో రెండో రోజు నుంచి కలెక్షన్లు డ్రాప్ అయిపోతాయని అంతా అనుకున్నారు కానీ.. ఈ సినిమా మీద వచ్చిన వివాదాలు, ఇటు వర్మ అటు వంగవీటి రాధాల సవాళ్లు ప్రతి సవాళ్లు.. విమర్శలు ప్రతి విమర్శల పుణ్యమా అని సినిమా బాగా జనాల నోళ్లలో నానింది. ఫస్ట్ వీకెండ్లో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. దక్కాల్సిన ప్రయోజనం అంతా దక్కిందనో ఏమో.. ఇక వివాదానికి తెరదించేయాలని భావించింది 'వంగవీటి' బృందం.

'వంగవీటి' సినిమా విషయంలో ఇక వర్మ ఏ స్టేట్మెంట్ ఇవ్వడంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు నిర్మాత దాసరి కిరణ్ కుమార్. 'వంగవీటి'పై రచ్చ జరుగుతున్నన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న ఆయన.. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ఇటు వర్మతో.. అటు వంగవీటి వర్గీయులతో తాను మాట్లాడానని.. సమస్యను సెటిల్ చేశానని.. ఇక ఈ వివాదానికి ఇంతటితో తెరపడినట్లే అని దాసరి అన్నాడు. వర్మ కూడా ఇక స్టేట్మెంట్లు ఇవ్వడని స్పష్టం చేశాడు.

అందుకేనేమో వర్మ నిన్న సాయంత్రం ఉన్నట్లుండి 'వంగవీటి' మీద ట్వీట్లు ఆపేసి.. వేరే టాపిక్స్ మీదికి వెళ్లిపోయాడు. మొత్తానికి 'వంగవీటి'తో మంట పెట్టేసి ఆ మంటలో చలికాచుకుని బాగానే వసూళ్లు రాబట్టుకున్న వర్మ.. ఆ సినిమా కథ ముగిసిందనుకున్న తరుణంలో సైలెంటవుతున్నాడు. ఎంతైనా తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడం వర్మ ప్రత్యేకత మరోసారి అందరికీ అర్థమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు