చెర్రీకి తన మీద తనకే అసహ్యమేసిందట

చెర్రీకి తన మీద తనకే అసహ్యమేసిందట

కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగబాబును ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేశారు. కృష్ణ.. చిరంజీవి.. బాలకృష్ణలు ఏడాదికి పది పన్నెండు.. ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పటి యువహీరోలు రామ్ చరణ్.. అల్లుఅర్జున్.. ఇలాంటి వారు ఏడాదికి ఒక సినిమా చేసే పరిస్థితి. ఎందుకిలా జరుగుతోందని అడిగారు.

దానికి నాగబాబు చెప్పిన సమాధానం.."వీళ్లకు భయమండి. ఎవరికి వారు వాళ్ల.. వాళ్ల ఇమేజ్ కు బంధీలు అయిపోయారు. అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కృష్ణ.. చిరంజీవి.. బాలకృష్ణ వాళ్ల టైంలో ఇవన్నీ ఆలోచించేవాళ్లు కాదు. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసుకుంటూ పోయే వారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకునేవారు.

ఇప్పటి వారు అలాంటి పరిస్థితి లేదు. మొదటి సినిమా పాతికకోట్లు కలెక్షన్లు వస్తే.. తర్వాతి సినిమా రూ.30 కోట్ల కలెక్షన్లు వచ్చే సినిమా కావాలన్న ఆలోచనలతో నెలలు నెలలు గడిపేస్తున్నారు" అని మొహమాటం లేకుండా అసలు విషయం చెప్పారు.

అడిగిన ప్రశ్నకు ఇంత సూటిగా సమాధానం చెప్పే టాలీవుడ్ ప్రముఖులు చాలా తక్కువమంది కనిపిస్తారు. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు ఒక ప్రముఖ యువహీరో తనకు సంబంధించిన లోపాన్ని.. తనకు తానే ఓపెన్ గా ఒప్పేసుకోవటం.. తానెంతగా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయానన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. తన మీద తనకు కలిగిన అసహ్యాన్ని ఒప్పేసుకోవటం గొప్పగానే చెప్పాలి.

అలా ఓపెన్ గా మాట్లాడిన యువ హీరో ఎవరో కాదు.. చెర్రీనే. తన తాజా ధ్రువ సినిమా విడుదలై.. సక్సెస్ గా రన్ అవుతున్న వేళ.. సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు పబ్లిసిటీ డోస్ ను మరింత ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చెర్రీ.. ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన సందర్భంలో.. చెర్రీ లాంటి మాస్ హీరో.. ధ్రువ లాంటి క్లాస్ సినిమాను ఎలా ఒప్పుకున్నాడు? చరణ్ మాస్ ఇమేజ్ ఏం కావాలి? బీ.. సీ సెంటర్ల ఆడియన్స్ గురించి ఆలోచించలేదా? అని అడిగిన ప్రశ్నకు.. సినిమాను చూసిన వెంటనే నిర్మాత ప్రసాద్ కు ఫోన్ చేశానని.. ఆయన ఇంకేం ఆలోచించకుండా చేసేయమన్నారని చరణ్ చెప్పారు.

"సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉండటమే కాదు.. నా బీ..సీ ఆడియన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తే అంత నమ్మకంగా చెప్పినప్పుడు.. ఈ ఇమేజ్ లో ఇరుక్కుపోయేనన్న అసహ్యం నాకు కలిగింది. వెంటనే ఓకే చెప్పేశా" అని ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేశాడు చరణ్. ప్రముఖ హీరో అయినప్పటికీ తనలోని నెగిటివ్ కోణాన్ని బయటకు చెప్పేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గని చెర్రీని అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు