వంగవీటి: అజ్నాతంలోకి దాసరి ?

వంగవీటి: అజ్నాతంలోకి దాసరి ?

జీనియస్.. రామ్ లీలా లాంటి చిన్నా చితకా సినిమాలూ తీస్తూ వచ్చిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్.. ఉన్నట్లుండి రామ్ గోపాల్ వర్మతో ‘వంగవీటి’ లాంటి పెద్ద సినిమాకు నిర్మాత అయ్యాడు. ఆయన అంతకుముందు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఇది మరో ఎత్తు. దీనికి మాంచి హైప్ వచ్చింది. ఆయన పేరు మార్మోగిపోయింది.

దాసరి కిరణ్ కుమార్ కాకుండా ఇంకే నిర్మాత అయినా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదని.. సినిమా పూర్తయ్యేది కాదని అతణ్ని వర్మే ఆకాశానికెత్తేశాడు. ఐతే విడుదలకు ముందు తన సినిమా గురించి జరిగిన చర్చను చూసి చాలా ఉత్సాహంగా కనిపించిన దాసరి కిరణ్ కుమార్.. ‘వంగవీటి’ రిలీజ్ తర్వాత కనిపించకుండా పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

‘వంగవీటి’ సినిమా చూసి రంగా అభిమానులు.. కాపు సామాజిక వర్గం రగిలిపోతున్నారు. తమ నేతను కావాలనే తగ్గించి చూపించారని మండి పడుతున్నారు. దాసరి కిరణ్ కుమార్ స్వయంగా కాపు నేత అయి ఉండి ఇలాంటి సినిమా తీస్తుంటే ఏం చేస్తున్నాడంటూ అతడి మీద కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఈ సినిమా విషయంలో వందలాది కాల్స్ వస్తుండటం.. అందరూ తనను నిలదీస్తుండటంతో కిరణ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఫోన్ స్విచాఫ్ చేసి ఎవరికీ దొరక్కుండా ఆయన అజ్నాతంలోకి వెళ్లిపోయాడట. పరిస్థితులు సద్దుమణిగాక బయటికి వచ్చి.. తన వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మతో సినిమా తీసినందుకు దాసరికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరిందో కానీ.. రాజకీయ నేపథ్యం కూడా ఉన్న ఆయనకు తన వర్గంలో ఇబ్బందులు మాత్రం తప్పేట్లు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు