వంగవీటి పాట తీసేయమంటూ సింగర్ ఆక్రోశం

వంగవీటి పాట తీసేయమంటూ సింగర్ ఆక్రోశం

వంగవీటి వంగవీటి వంగవీటి.. అంటూ 'వంగవీటి' సినిమాలోని టైటిల్ సాంగ్ భలేగా పాపులరైంది. సినిమాలో కూడా ఆ పాట ప్రత్యేకంగా నిలిచింది. ఐతే ఆ పాట విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. సినిమాలోంచి ఆ పాట తీసేయమంటూ దాన్ని పాడిన రాజశేఖర్ అనే సింగర్ గొడవ చేస్తున్నాడు. వర్మ తనకు తీరని అన్యాయం చేశాడంటూ అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పాటను తనే ట్యూన్ చేసి.. పాడానని.. ఐతే సినిమా టైటిల్స్‌లో తన పేరే వేయకుండా మోసం చేశారని.. తనకు క్రెడిట్ ఇవ్వని నేపథ్యంలో ఆ పాటను సినిమా నుంచి తీసేయాలని అతను డిమాండ్ చేశాడు.

వర్మ ఓ టీవీ ఛానెల్ లైవ్‌లో ఉండగా ఫోన్ ఇన్ ద్వారా రాజశేఖర్ వర్మ మీద దుమ్మెత్తిపోయాడం గమనార్హం. ఐతే వర్మ ఈ వివాదంపై తనదైన శైలిలో బదులిచ్చాడు. 'వంగవీటి' సినిమాలో పది పాటలుంటాయని.. అందులో తొమ్మిది పాటల్ని మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకరే ట్యూన్ చేశాడని.. పదో పాట అయినా ఈ వంగవీటి సాంగ్‌ను కూడా అతనే ట్యూన్ చేయగా ముందు తాను పాడానని.. ఐతే తర్వాత దీనికి కొంచెం ఫాస్ట్ వెర్షన్ ఉండాలని రాజశేఖర్‌తో వేరేగా పాట పాడించి, అతడితోనే ట్యూన్ చేయించామని వర్మ చెప్పాడు. విజయవాడలో ఆడియో వేడుకకు రాజశేఖర్‌ను తీసుకెళ్లి, వేదిక మీదికి కూడా ఆహ్వానించి అతణ్ని తనే స్వయంగా పరిచయం చేశానని.. ఐతే టైటిల్ క్రెడిట్స్ వేసేటపుడు పొరబాటున అతడి పేరు పడి ఉండకపోవచ్చని.. ఇలా చాలా సినిమాలకు జరుగుతూ ఉంటుందని.. అంతమాత్రం దానికి ఇలా లైవ్‌లోకి వచ్చి అరిస్తే చేసేదేం లేదని.. అతను ఏం చేసుకుంటాడో చేసుకోవచ్చని తేల్చి చెప్పేశాడు వర్మ.