వర్మ పబ్బం బాగానే గడిచింది

వర్మ పబ్బం బాగానే గడిచింది

మీరు పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారంటారు.. కావాలనే వివాదాలు రాజేస్తాంటారు.. అంటూ ఇంకే దర్శకుడినైనా అడిగితే.. అలాంటిదేమీ లేదని ఖండిస్తాడు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం అలా కాదు. అవును నేనేం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తా. కావాలనే వివాదాలు రాజేస్తా.

వివాదాస్పద అంశాలపై సినిమాలు తీస్తా అని బదులిస్తాడు. అంతే ఇక అక్కడ చర్చ అన్నదే ఉండదు. తాజాగా 'వంగవీటి' సినిమా విషయంలోనూ కావాల్సినన్ని వివాదాలు రాజేశాడు వర్మ. పైసా ఖర్చు లేకుండా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఆ ప్రభావం కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క 'కిల్లింగ్ వీరప్పన్' మినహాయిస్తే ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ చెత్తే. ఒకప్పుడు పబ్లిసిటీ జిమ్మిక్కులతో తన సినిమాలకు మాంచి ఓపెనింగ్స్ తెచ్చుకునేవాడు వర్మ. కానీ తర్వాత తర్వాత జనాలు ఈ జిమ్మిక్కుల్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో వర్మ సినిమాలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. కానీ ఇప్పుడు 'వంగవీటి' సినిమాతో వర్మ మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఈ సినిమాకు మామూలు హైప్ రాలేదు. ఒకప్పుడు 'రక్తచరిత్ర'కు ఎంత క్రేజ్ వచ్చిందో ఈ సినిమాకు కూడా అంతే క్రేజ్ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా తొలి రోజు హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఈ సినిమాపై పెట్టిన ఖర్చు తొలి రోజు వసూళ్లతోనే రికవరీ అయిపోయి ఉంటుందంటే అతిశయోక్తి ఏమీ లేదంటున్నారు. మొత్తానికి కంటెంట్ వీక్ అయినా సరే.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి వసూళ్లయితే బాగానే రాబట్టుకున్నాడు వర్మ. సినిమాలో విషయం లేదని తెలిశాక రెండో రోజుకు కలెక్షన్లు పడిపోవాలి కానీ.. ఈ సినిమా విషయంలో తలెత్తిన వివాదాలు.. మీడియా ఇస్తున్న పబ్లిసిటీ.. చర్చా కార్యక్రమాల పుణ్యమా అని.. అంతగా సినిమాలో ఏముందో అంటూ జనాలు తర్వాత కూడా బాగానే థియేటర్లకు వెళ్తున్నట్లున్నారు. వీకెండ్ అంతా కూడా 'వంగవీటి' ఊపు కొనసాగుతున్నట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు