హిందీ ముందు.. తెలుగు, తమిళం ఓడిపోయాయ్

హిందీ ముందు.. తెలుగు, తమిళం ఓడిపోయాయ్

తెలుగులో ఒకటికి ఐదు సినిమాలొచ్చాయి ఈ వీకెండ్లో. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఐదు సినిమాల మీదా పాజిటివ్ బజ్ వచ్చింది. అన్ని సినిమాలూ ఆడేలాగే కనిపించాయి. కానీ హిందీ డబ్బింగ్ సినిమా ‘దంగల్’ మినహాయిస్తే అన్నీ ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి.

రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో వర్మ ఈజ్ బ్యాక్ అంటూ రాజమౌళి సహా చాలామంది ధీమా వ్యక్తం చేశారు. కానీ ‘వంగవీటి’లో అంత విషయం లేదని తొలి షోతోనే తేలిపోయింది. సినిమా మీద ఉన్న హైప్ వల్ల ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత ‘వంగవీటి’ నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ కూడా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. దీనికి కూడా ఓపెనింగ్స్ పర్వాలేదు. విశాల్ ‘ఒక్కడొచ్చాడు’కు పేలవమైన టాక్ వస్తోంది. దీనికి కలెక్షన్లు ఏమంత బాగా లేవు. ఒక రోజు ఆలస్యంగా శనివారం రిలీజైన ‘పిట్టగోడ’కు అందరూ అనుకున్నట్లుగా సర్ప్రైజ్ హిట్టయిపోయేంత సీన్ ఏమీ లేదని తేలిపోయింది. ఈ సినిమాకు టాక్ ఏవరేజ్‌గా ఉంది.

ఐతే హిందీ డబ్బింగ్ మూవీ యుద్ధం (దంగల్) మాత్రం తెలుగులోనూ చాలా బాగా ఆడేస్తోంది. ప్రేక్షకుల మిగతా సినిమాల రిజల్ట్ చూసి దీని వైపు మళ్లుతున్నారు. అమీర్ ఖాన్ నుంచి వచ్చిన అద్భుతమైన సినిమాను తెలుగులోనూ చూసుకునే అవకాశం వచ్చినందుకు మురిసిపోతూ థియేటర్లకు తరలుతున్నారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు