కామెడీ వేషాలు బోర్ కొట్టేశాయట..

కామెడీ వేషాలు బోర్ కొట్టేశాయట..

సప్తగిరి కమెడియన్ అవతారమెత్తి ఐదేళ్లే అవుతోంది. అందులోనూ అతను స్టార్ కమెడియన్ అయింది రెండు మూడేళ్ల కిందటే. కానీ అప్పుడే కామెడీ వేషాలు బోర్ కొట్టేశాయి అంటున్నాడు. కమెడియన్‌గా ఒకే తరహా పాత్రలు చేసి చేసి విసుగొచ్చేసిందని.. అందుకే హీరో అవతారం ఎత్తేశానని తేల్చి చెప్పేశాడు సప్తగిరి.

''కమెడియన్‌గా ఫామ్‌లో ఉండగా హీరో ఎందుకు అవ్వాలనిపించిందని చాలామంది అన్నారు. కానీ నేను చాలా రోజుల్నుంచి ఒకే తరహా పాత్రలు చేస్తున్నా. ఒకేలా నటిస్తున్నా. అది నాకే బోర్ కొట్టింది. నేను సెంటిమెంటు పండించగలనని.. డ్యాన్సులు, ఫైట్లు కూడా చేసి మెప్పించగలనని అనిపించింది. అందుకే హీరోగా సినిమా చేశాను'' అని సప్తగిరి అన్నాడు.

హీరో అయినంత మాత్రాన కామెడీ పాత్రలు చేయకుండా ఆపేసే ప్రసక్తే లేదని సప్తగిరి అన్నాడు. కమెడియన్‌గా ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలిపాడు. ఇకముందూ కమెడియన్‌గా కొనసాగుతానని.. హీరో పాత్రలు వస్తే అవీ చేస్తానని చెప్పాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'లో తాను ఎవరినీ అనుకరించలేదని.. పేరడీలు, స్పూఫ్‌లు ఏమీ ఉండవని సప్తగిరి తెలిపాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' రిలీజ్ డేట్ ఖరారైనప్పటి నుంచి 15 రోజులుగా తాను సరిగా నిద్రపోనే లేదని.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని సప్తగిరి తెలిపాడు.

మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని.. సక్సెస్ మీద నమ్మకం ఉన్నప్పటికీ రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మాత్రం ఉందని అన్నాడు. తన సినిమాను చూస్తానని పవన్ కళ్యాణ్ అనడం తన అదృష్టమని.. ప్రస్తుతం ఆయన పొల్లాచ్చిలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడని.. రాగానే ఆయనకు సినిమా చూపిస్తామని సప్తగిరి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు