'మగధీర' తర్వాత మళ్లీ ఇప్పుడే..

'మగధీర' తర్వాత మళ్లీ ఇప్పుడే..

కెరీర్లో రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసే సినిమా చేశాడు రామ్ చరణ్. 'మగధీర' టాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలుకొట్టేసింది. కానీ ఆ తర్వాత చరణ్ సినిమాలేవీ అంచనాల్ని అందుకోలేకపోయాయి. హిట్లయితే ఉన్నాయి కానీ.. 'మగధీర'కు దీటైన హిట్లు లేవు. 'మగధీర' తర్వాత ఒక్కసారి కూడా మళ్లీ రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేయలేకపోయాడు చరణ్. ఐతే ఇప్పుడు 'ధృవ'తో ఆ లోటు తీరింది.

ఈ సినిమా రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ రూ.75 కోట్ల దాకా ఉంది. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, జనతా గ్యారేజ్ తర్వాత రూ.50 కోట్ల షేర్ సాధించిన సినిమా 'ధృవ'నే. పాజిటివ్ టాక్తో మొదలైన 'ధృవ' రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లే సాధించింది. పోయిన వారం పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడం.. రిలీజైన రెండు చిన్న సినిమాలకూ టాక్ ఏమంత బాగా లేకపోవడం 'ధృవ'కు కలిసొచ్చింది.

ఐతే రెండు వారాల్లో బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ.. 'ధృవ' ఇంకా బ్రేక్ ఈవెన్కు మాత్రం రాలేదు. ఇంకా చాలా ఏరియాల్లో బయ్యర్లు డెఫిషిట్లోనే ఉన్నారు. ఇంకో పది కోట్ల దాకా వసూలు చేస్తే తప్ప బయ్యర్లందరూ లాభాల్లోకి రారు. ఈ వారం ఒకటికి ఐదు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో 'ధృవ' లాభాలు అందించడం కష్టమే కావచ్చు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.55 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తుందని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English