రకుల్ నోట బ్రూస్ లీ, కిక్-2 మాట

రకుల్ నోట బ్రూస్ లీ, కిక్-2 మాట

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. ఒక హీరోయిన్ వరుసగా రెండు ఫ్లాపుల్లో నటించిందంటే చాలు.. ఆమె మీద 'ఐరెన్ లెగ్' అని ముద్ర వేసేస్తారు. గత ఏడాది రకుల్ ప్రీత్ నటించిన మూడు సినిమాలూ ఫ్లాపే అయ్యాయి. అయినప్పటికీ ఈ ఏడాది ఆమెకు మంచి అవకాశాలే దక్కాయి. హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చిన రకులే.. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తన ట్రాక్ రికార్డు చూడకుండా తనకు అవకాశాలిచ్చిన వాళ్లకే తన సక్సెస్ క్రెడిట్ దక్కుతుందని అంటోంది రకుల్.

''డిసెంబరు అనగానే ఆ యేడాదంతా చేసిన పని కళ్ల ముందు మెదులుతుంది. సాధించిన విజయాలకు సంబరాలు చేసుకొంటాం. ఆ రకంగా ఇది నాకు సంబరాల సమయమే. 'ధృవ' రూపంలో మంచి విజయం లభించింది. ఈ ఏడాది నేను నటించిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. నేను గత ఏడాది రామ్ చరణ్‌తో చేసిన 'బ్రూస్‌లీ' పరాజయం చవిచూసింది. సురేందర్‌ రెడ్డితో చేసిన 'కిక్‌ 2' కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. అయినా వాళ్లిద్దరూ అదేమీ పట్టించుకోకుండా నన్ను 'ధృవ' కోసం ఎంచుకొన్నారు. ఆ ఎంపికే నా విజయంగా, పనితీరుకు దక్కిన గౌరవంగా భావించాను. జయాపజయాల్ని ఎవరూ నిర్దేశించలేరు'' అని రకుల్ చెప్పింది. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నాక తన మీద తనకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని.. 'ధృవ'కు కూడా డబ్బింగ్‌ చెబుదామనుకొన్నా కుదర్లేదనని.. తానిప్పుడు పూర్తిగా తెలుగమ్మాయిని అయిపోయానని రకుల్ తెలిపింది.  తెలుగులో మాట్లాడడమే కాక.. ఆలోచించేటపుడు కూడా తనకు తెలుగే వస్తోందని.. సెట్‌లో ఎవరినైనా తిట్టాలన్నా తెలుగులోనే తిడుతున్నట్లు చెప్పింది రకుల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు