కమల్ కలల సినిమా మళ్లీ తెరపైకి...

కమల్ కలల సినిమా మళ్లీ తెరపైకి...

కమల్ హాసన్ కలల సినిమా 'మరుదనాయగం' గురించి ఇప్పటికే చాలా చర్చ నడిచింది. 90ల చివర్లో క్వీన్ ఎలిజబెత్‌-2ను ఇండియాకు రప్పించి ఆమె చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపించి.. ఆ తర్వాత కొంత కాలం షూటింగ్ చేసి.. మధ్యలో బడ్జెట్ సమస్యలతో ఆపేశాడు కమల్ హాసన్.

ఆ తర్వాత ఆ సినిమాను మళ్లీ మొదలుపెడతానని.. పూర్తి చేస్తానని చాలాసార్లు చెప్పాడు కమల్. చూస్తుండగానే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అప్పటికి ఇప్పటికి కమల్ హాసన్‌లో చాలా మార్పు వచ్చేసింది. అప్పట్లోనే రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడానికి ప్రణాళికలు వేశాడు కమల్. ఇప్పుడు బడ్జెట్ మూణ్నాలుగు రెట్లయినా అవుతుందేమో.

మరి అంత బడ్జెట్ పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఐతే 'రోబో' సీక్వెల్ '2.0' మీద లైకా ప్రొడక్షన్స్ రూ.400 కోట్ల బడ్జెట్ పెడుతుండటం చూసి కమల్ హాసన్‌లో ఆశ పుట్టినట్లుంది. కొన్ని నెలలుగా ఆ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాడు కమల్. ఇప్పుడు ఆ చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి తన 'శభాష్ నాయుడు' షూటింగ్ మొదలుపెట్టిన కమల్.. ఇటీవలే యూకేకు వెళ్లొచ్చాడు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తో పాటు ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన ఓ లండన్ ఫ్రెండుతో కలిసి సమావేశంలో పాల్గొన్నాడట కమల్.

ఇంతకుముందు ప్రొడక్షన్ ఎక్కడ ఆగింది.. మిగతా సినిమా పూర్తి చేయడానికి ఏం చేయాల్సింది.. కథలో మార్పులు.. బడ్జెట్.. మార్కెటింగ్ అన్నింటి మీదా కమల్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English