మూడు ఫ్లాపులు.. మూడు సూపర్ హిట్లు

మూడు ఫ్లాపులు.. మూడు సూపర్ హిట్లు

అప్పుడెప్పుడో తెలుగులో 'కెరటం' అనే సినిమా చేసి ఆ తర్వాత మాయమైంది రకుల్ ప్రీత్. ఆ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' లాంటి చిన్న సినిమాతో హిట్టు కొట్టి ఉన్నట్లుండి రైజ్ అయింది. టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో ఒకరైన రకుల్.. ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది. గత ఏడాది తెలుగులో ఆమె నటించిన మూడు సినిమాలూ ఫ్లాపులే. అందులోనూ కిక్-2', బ్రూస్ లీ' దారుణమైన ఫలితాన్ని చూశాయి. 'పండగ చేస్కో' కూడా నిరాశ పరిచింది. దీంతో రకుల్ను ఐరెన్ లెగ్ అనేశారు టాలీవుడ్ జనాలు. కానీ అలా అన్నవాళ్లందరితోనూ ఇప్పుడు లక్కీ గర్ల్ అనిపిస్తోంది రకుల్.

ఈ ఏడాది రకుల్ నటించిన మూడు సినిమాలూ హిట్లే. ఏడాది ఆరంభంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాతో తొలి హిట్టు కొట్టిన రకుల్.. సమ్మర్లో 'సరైనోడు' రూపంలో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. తాజాగా 'ధృవ'తో హ్యాట్రిక్ కొట్టేసింది ఈ ఢిల్లీ భామ. ఈ మూడు సినిమాల్లోనూ రకుల్ పాత్రలు కూడా బాగానే పండాయి. ఆమె నటనా ఆకట్టుకుంది. గ్లామర్ పరంగానూ మంచి మార్కులు కొట్టిసింది రకుల్. ప్రస్తుతం రకుల్ ఖాతాలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. మహేష్ సినిమాతో పాటు చైతూతో ఓ మూవీ.. సాయిధరమ్తో 'విన్నర్'.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో ఆమె కథానాయికగా నటిస్తోంది. కొత్త ఏడాదిలోనూ రకుల్ ఇదే ఊపుతో కొనసాగుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు