ప్రధానికి జేడీ లక్ష్మీనారాయణ లేఖ.. అందులో ఏమున్నదంటే?

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ ను అమ్మేయటం తప్పించి మరో ఆప్షన్ లేదని కేంద్రం తేల్చి చెప్పేసిన నేపథ్యంలో విశాఖ ప్రజలతో పాటు ఏపీ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.కేంద్రంలోని మోడీ సర్కారుపై మండిపాటు వ్యక్తమవుతుంది. ఇలాంటి వేళ.. పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ ఇష్యూ మీద స్పందించారు. ప్రధాని మోడీకి లేఖ రాశారు.

దేశంలో మరే స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకత విశాఖ ఉక్కుకు ఉందన్నారు. దేశంలో సముద్ర తీరంలో ఉన్నఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖేనని చెప్పారు. ఎగుమతికి.. దిగుమతికి అత్యంత అనువైన స్టీల్ ప్లాంట్ విశాఖగా పేర్కొన్న ఆయన మరిన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానిది రెండో స్థానమన్న లక్ష్మీనారాయణ.. కొన్ని సూచనల్ని అమలు చేస్తే విశాఖ స్టీల్ కు పూర్వ వైభవం తీసుకురావొచ్చన్నారు.

ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానికి రెండో స్థానమన్న ఆయన.. ఈ పరిశ్రమను ప్రైవేటీకరిస్తే సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరల్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదని.. ప్రైవేటీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. రేపటి రోజున స్టీల్ కొనటం కష్టంగా మారుతుందన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3200 టన్నులు.. అటల్ టన్నెల్ కు 2200 టన్నుల స్టీల్ ను విశాఖ నుంచే పంపిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన స్టీల్ కంటే కూడా విశాఖ స్టీల్ నాణ్యమైదన్న విషయాన్ని గర్తు చేశారు.

అన్నిటితో పాటు విశాఖ స్టీల్ ను చూడకుండా ప్రత్యేకంగా తీసుకొని చర్యలు చేపడితే మళ్లీ గాడిన పెట్టటం సాధ్యమేనన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భాక్రానంగల్.. హీరాకుడ్.. నాగార్జునసాగర్ తో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేశారని.. అలానే ఖిలాయ్ లాంటి ఉక్కు పరిశ్రమతో పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేశారన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక అనేకమంది ప్రాణ త్యాగం ఉందన్న ఆయన.. తమ చిన్నప్పుడు విశాఖ పోరాటం గురించి చర్చించుకుంటే విన్నట్లుచెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల గుండెచప్పుడన్న ఆయన.. టీమిండియా క్రికెట్ లో గెలిస్తే దేశం గెలిచిందని సంబురాలు చేసుకుంటామని.. స్టీల్ కేంద్రం చేతుల్లో ఉంటే అందరికి గర్వకారణమన్నారు. మరి.. మాజీ జేడీ రాసిన లేఖకు ప్రధాని మోడీ ముందుకు వస్తారా? తనకు ఇష్టం లేని విషయాల మీద ఎవరెంత చెప్పినా స్పందించని తీరు ఉన్న ఆయన.. విశాఖ స్టీల్ విషయంలోనూ అదే వ్యూహాన్ని పాటిస్తారా? అన్నది అసలు ప్రశ్న.