'ధృవ' చివరి 20 నిమిషాల్లో ఏముంది?

'ధృవ' చివరి 20 నిమిషాల్లో ఏముంది?

ఈ రోజుల్లో రీమేక్ సినిమా తీయడం పెద్ద సాహసమే. ఫలానా సినిమాకు రీమేక్ అనగానే వికీపీడియాలో ఆ సినిమా పేజీ తీస్తే కథతో పాటు అన్ని విశేషాలూ తెలిసిపోతాయి. నెట్లో వెతికితే సినిమా కూడా చూసేయొచ్చు. అది కూడా సబ్ టైటిల్స్ తో. ఈ నేపథ్యంలోనే జనాలకు రీమేకుల మీద క్రమంగా ఆసక్తి తగ్గిపోతోంది. ఇలాంటి టైంలోనూ తమిళ బ్లాక్ బస్టర్ 'తనీ ఒరువన్'కు రీమేక్ గా వస్తున్న 'ధృవ' ప్రేక్షకుల్లో బాగా క్యూరియాసిటీ కలిగించింది.

రీమేకే అయినా.. సురేందర్ రెడ్డి తనదైన స్టైలిష్ టచ్ ఇస్తూ సినిమాను తెరకెక్కించిన వైనం టీజర్.. ట్రైలర్లలో కనిపించింది. సినిమా ప్లాట్ విషయంలో మార్పులేమీ చేయకపోయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు కొన్ని మార్పులు కూడా చేశాడట సురేందర్. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా తీర్చిదిద్దడమే కాక.. రామ్ చరణ్ ఇమేజ్.. అభిమానుల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే చివర్లో హీరో పాత్ర హైలైట్ అయ్యేలా చూశాడని.. చివరి 20 నిమిషాల్లో కొత్తగా ఒక ట్విస్టుతో మరింత రసవత్తరంగా తీర్చిదిద్దాడని యూనిట్ నుంచి సమాచారం వస్తోంది.

తమిళ వెర్షన్ కంటే 'ధృవ'ను మరింత పకడ్బందీగా.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. సినిమా విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందని నిర్మాత అల్లు అరవింద్.. 'ధృవ' విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారట. ఆయన మాటల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి 'ధృవ' ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు