నాని నరేట్ చేసిన టీజర్ బావుందే..

నాని నరేట్ చేసిన టీజర్ బావుందే..

నిర్మాతగా తొలి సినిమా 'అష్టాచెమ్మా'తోనే తన అభిరుచి ఏంటో చాటుకున్నాడు రామ్మోహన్. ఆ తర్వాత గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల సినిమాలతోనూ తన నుంచి వచ్చే సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో మరోసారి చూపించాడు. స్వీయ దర్శకత్వంలో తీసిన 'తను నేను' నిరాశ పరిచినా.. మళ్లీ నిర్మాత అవతారమెత్తి 'పిట్టగోడ' అనే మరో వైవిధ్యమైన సినిమాతో పలకరించబోతున్నాడు రామ్మోహన్.

రామ్మోహన్ తొలి చిత్ర హీరో, నేచురల్ స్టార్ నాని ఈ 'పిట్టగోడ' ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ టీజర్లో నాని వాయిస్ కూడా వినిపించడం విశేషం. ''ఇందుమూలంగా గోదావరిఖని ప్రజలకి.. ఇంటింటా జరిగే తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సర్వేకు సహకరించాల్సిందిగా విన్నపం.. చెప్పండమ్మా ఏం చేశాడు మీవాడు..'' అంటూ నాని వాయిస్ మొదలవుతుంది టీజర్లో. ఇలా ఒక్కొక్కర్నే సర్వే చేశాక ఆ ఊర్లో అందరూ కేవలం నలుగురు కుర్రాళ్లు మాత్రమే ఏ పనీ పాటా లేకుండా బేవార్సుగా తిరుగుతున్నట్లు తేలుతుంది.

ఆ నలుగురిలో ఒకరు హీరో.. మిగతా ముగ్గురూ అతడి స్నేహితులు. ఈ నలుగురికీ ఒక పిట్టగోడ మీద కూర్చుని ముచ్చట్లు పెట్టడమే పని. ఐతే ఇలా ఒక రోజు పిట్టగోడ మీద కూర్చుని ఉండగా హీరోయిన్ వచ్చి.. దగ్గర్లో స్టేషనరీ షాపేమైనా ఉందా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తడబడి.. ఆ తర్వాత ఆ అమ్మాయి వెంట వెళ్లిపోతాడు హీరో. ఇదీ సింపుల్‌గా.. స్వీట్‌గా అనిపించే 'పిట్టగోడ' టీజర్. ఈ చిత్రాన్ని అనుదీప్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తుండగా.. విశ్వనాథ్ రాచకొండ హీరోగా పరిచయమవుతున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ పునర్ణవి కథానాయికగా నటిస్తోంది. 'ప్రాణం' కమలాకర్ సంగీతాన్నందిస్తున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు