వెంకీ సినిమాలో తమిళ సీన్లు వాడేస్తున్నారా?

వెంకీ సినిమాలో తమిళ సీన్లు వాడేస్తున్నారా?

రీమేక్ అనగానే ఒరిజినల్లోని సన్నివేశాల్ని మక్కీకి మక్కీ దించేయడం చూస్తుంటాం. కానీ మాతృకలోని సన్నివేశాల్ని అలాగే తీసుకుని రీమేక్ మూవీలో వాడుకోవడం అన్నది ఎక్కడా వినలేదు. విక్టరీ వెంకటేష్ మూవీ 'గురు' కోసం అలాగే చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో హిట్టయిన 'ఇరుదు సుట్రు/సాలా ఖడూస్'కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

తమిళంలో కీలక పాత్ర పోషించిన రితికానే తెలుగులోనూ అదే రోల్ చేస్తోంది. ఐతే హీరోయిన్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని మళ్లీ తీయాల్సిన అవసరం లేకుండా.. ఒరిజినల్ నుంచి వాడుకోవాలని ముందే డిసైడయ్యారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోసే తెలుగులోనూ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఇబ్బందేమీ లేకపోయింది. తమిళ వెర్షన్ చెన్నై తీర ప్రాంతం నేపథ్యంలో సాగితే.. ఇక్కడ వైజాగ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. హీరోయిన్ బాక్సింగ్ సాధనతో పాటు మరికొన్ని సన్నివేశాల్ని తెలుగులో వాడుకున్నా ఇబ్బందేమీ రాదని ఈ నిర్ణయం తీసుకున్నారట.

దాదాపు 15 నిమిషాల తమిళ ఫుటేజ్ ను తెలుగు కోసం వాడుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగమ్మాయే అయిన సుధ కొంగర రూపొందిస్తోంది. షూటింగ్ మొదలైన మూడు నెలల్లోనే ఈ చిత్రం ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 26న 'గురు' ప్రేక్షకుల ముందుకొస్తుంది. వెంకీ బాక్సింగ్ కోచ్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు