సోలోగా వస్తేనే బెట్టర్

సోలోగా వస్తేనే బెట్టర్

విక్టరీ వెంకటేష్ వెనక్కి తగ్గాడు. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజీని వాడేసుకుందామని చూసిన వెంకీ.. మనసు మార్చుకున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గురు' సినిమా సంక్రాంతికి రాదని తేలిపోయింది. ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న రిలీజ్ చేయడానికి నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు డిసైడయ్యారు. సంక్రాంతి రిలీజ్ కోసం మొన్నటి దాకా బాగానే టెంప్ట్ అయినప్పటికీ.. సెలవుల అడ్వాంటేజీ చూసుకుని తొందరపడితే.. పోటీ వల్ల నష్టపోతామని భావించారాయన.

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో పాటు బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' కూడా పక్కా అని తేలిపోవడంతో వెంకీ మూవీని రేసులో నిలపొద్దని నిర్ణయించుకున్నారు. సంక్రాంతికి శర్వానంద్ మూవీ 'శతమానం భవతి' కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రెండు వారాలకు సంక్రాంతి సినిమాల జోరు తగ్గుతుంది కాబట్టి.. సోలోగా జనవరి 26న 'గురు'ను రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు.

తమిళ, హిందీ భాషల్లో విజయవంతమైన 'సాలా ఖడూస్/ఇరుదు సుట్రు'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న 'గురు'లో ఒరిజినల్‌లో కీలక పాత్ర చేసిన రితికా సింగే ఇక్కడా అదే క్యారెక్టర్ చేస్తోంది. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకురాలు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి.. విడుదల తేదీకి చాలా ముందే ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారు.