అల్లరోడి సినిమా.. అయ్యో పాపం!

అల్లరోడి సినిమా.. అయ్యో పాపం!

అసలే అల్లరి నరేష్ కెరీర్ కొన్నేళ్లుగా అంతంతమాత్రంగా ఉంది. 'సుడిగాడు' తర్వాత సరైన సక్సెస్ లేక అల్లాడుతున్నాడు. ఇలాంటి టైంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత బేనర్లో.. జి.నాగేశ్వరరెడ్డి లాంటి తనకు అచ్చొచ్చిన దర్శకుడితో చేసిన 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు నరేష్. పైగా హార్రర్ కామెడీ అనేది సక్సెస్ ఫుల్ ఫార్ములా కావడంతో ఈ చిత్రం మీద కాన్ఫిడెంటుగా కూడా ఉన్నాడు. కానీ ఈ సినిమా సరైన సమయానికి విడుదలకు నోచుకోలేకపోతోంది. దసరాకు అన్నారు.. ఆ తర్వాత దీపావళికి అన్నారు. రెండు పండగ సీజన్లూ దాటిపోయాయి. ఎట్టకేలకు నవంబరు 11న విడుదలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసి.. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలేశాక.. పెద్ద నోట్ల రద్దుతో ఈ సినిమాకు పెద్ద దెబ్బే పడింది.

సాహసం శ్వాసగా సాగిపో.. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. లాంటి సినిమాల్ని ధైర్యం చేసి రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. అల్లరోడి సినిమాను మాత్రం నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రిలీజ్ చేసే సాహసం చేయలేకపోతున్నాడు. విడుదలకు ముందు బయ్యర్ల నుంచి రావాల్సిన పేమెంట్లు రాకపోవడంతో పాటు కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్న భయంతో ఆయన సినిమాను వాయిదా వేశాడు. ఐతే 17న సినిమా వచ్చేస్తుందన్నారు కానీ.. ఆ తేదీకి కూడా రిలీజ్ చేయలేదు. తర్వాతి వారానికి కూడా సినిమా వచ్చేలా కనిపించట్లేదు. శ్రీనివాసరెడ్డి కూడా ధైర్యం చేసి.. తన 'జయమ్ము నిశ్చయమ్మురా'ను 25న విడుదలకు సిద్ధం చేశాడు. కానీ అల్లరోడి సినిమాకు మాత్రం ఆ తేదీకి కూడా మోక్షం కలిగేలా లేదు. చూస్తుంటే ఈ చిత్రం ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా కనిపించట్లేదు. డిసెంబర్లో కూడా ప్రతి వారానికీ సినిమాలూ కర్చీఫ్స్ వేసేసిన నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు