అవసరాల సినిమాకు 'డోనరుడి' దెబ్బ..

అవసరాల సినిమాకు 'డోనరుడి' దెబ్బ..

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలతో పోలిస్తే.. బాలీవుడ్ చాలా ప్రోగ్రెసివ్. అర్బన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని వాళ్లు చాలా సినిమాలే తీస్తుంటారు. కేవలం మల్టీప్లెక్సుల్ని నమ్ముకున్నా వాళ్లకు వర్కవుట్ అయిపోతుంది. అందుకే అక్కడ అడల్ట్ కామెడీలు తరచుగా వస్తుంటాయి. బాగా ఆడుతుంటాయి కూడా. ఢిల్లీ బెల్లీ.. విక్కీ డోనర్.. హంటర్ లాంటి సినిమాలు అక్కడ మంచి విజయం సాధించాయి. ఐతే ఇలాంటి అడల్ట్ కామెడీల్ని సౌత్‌లో రీమేక్ చేస్తే మాత్రం చేదు అనుభవాలే మిగులుతున్నాయి. 'ఢిల్లీ బెల్లీ' తమిళ రీమేక్ అట్టర్ ఫ్లాప్ అయింది. తాజాగా 'విక్కీ డోనర్' తెలుగు రీమేక్ 'నరుడా డోనరుడా' ఎలాంటి ఫలితాన్నందుకుందో తెలిసిందే. మరో అడల్ట్ కామెడీ 'గుంటూరు టాకీస్' కూడా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'హంటర్' రీమేక్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచి ఉంది. ఈ సినిమాను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని సందేహిస్తున్నారు. పైన చెప్పుకున్న బాలీవుడ్ అడల్ట్ కామెడీలతో పోలిస్తే 'హంటర్' మరింత బోల్డ్‌గా ఉంటుంది. అడల్ట్ కామెడీ డోస్ బాగా ఎక్కువుంటుంది. అందులోనూ ఇది ఓ సెక్స్ అడిక్ట్ కథ. కథ అంతా సెక్స్ చుట్టూనే తిరుగుతుంది. 'నరుడా డోనరుడా'లో వీర్యదానం గురించి చెబితే మనవాళ్లకు ఎక్కలేదు. ఆ కామెడీ అదీ.. ఎబ్బెట్టుగా అనిపించింది. ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారిందని.. హిందీలో కంటే కూడా బోల్డ్‌గా సన్నివేశాలు తీశారు. ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో 'హంటర్' రీమేక్ 'సోగ్గాడు' విషయంలో జాగ్రత్త పడాల్సిందే. ఈ చిత్రాన్ని కూడా ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఐతే అవసరాల స్వయంగా ఓ దర్శకుడు కాబట్టి అతను కొంచెం దృష్టిపెట్టాలి. తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాను తీర్చిదిద్దాలి. 'నరుడా డోనరుడా' వల్ల ఈ సినిమా మీద కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ పడిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా వస్తుందో.. ఎలాంటి ఫలితాన్నందుకుంంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు