నాగ్‌... ఏ ఒక్క‌రికి బాకీ లేడ‌ట‌!

నాగ్‌... ఏ ఒక్క‌రికి బాకీ లేడ‌ట‌!

టాలీవుడ్ న‌వ మ‌న్మ‌థుడిగా పేరుప‌డ్డ నాగార్జున అక్కినేని నేటి ఉద‌యం ఆస‌క్తిక‌ర ప్ర‌కట‌న చేశాడు. ఈ ప్ర‌క‌ట‌న ఒక్క  సినీ వ‌ర్గాల‌నే కాకుండా అన్ని వ‌ర్గాల‌ను అమితంగా ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. టాలీవుడ్ తొలి త‌రం న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట వార‌సుడిగా సినీ తెరంగేట్రం చేసిన నాగ్‌... చాలా సినిమాలే చేశాడు. వాటిలో హిట్స్ కొన్ని ఉంటే అట్ట‌ర్ ప్లాఫ్‌ల‌ను కూడా ఆయ‌న చవిచూశాడు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే... అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాదులో త‌న స‌తీమ‌ణి అన్న‌పూర్ణ పేరిట అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించారు.  చెన్నై నుంచి టాలీవుడ్ హైద‌రాబాదు త‌ర‌లివ‌చ్చిన స‌మ‌యంలో ఇక్క‌డ సినిమా రంగానికి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను ఇక్క‌డే పూర్తి చేసే ఉద్దేశంతోనే అక్కినేని నాడు ఈ స్టూడియోను క‌ట్టారు. ప్ర‌స్తుతం హైద‌రాబాదులో అన్న‌పూర్ణ స్టూడియోస్ ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు బ‌తికున్నంత కాలం అన్న‌పూర్ణ స్టూడియోస్ ఏ ఒక్క సంద‌ర్భంలోనూ వివాదంలో చిక్కుకున్న దాఖ‌లా లేదు.

అయితే నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణించిన త‌ర్వాత స్వ‌ల్ప కాలంలోనే అన్న‌పూర్ణ స్టూడియోస్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌ర్వాత స్టూడియో బాధ్య‌త‌లు తీసుకున్న నాగార్జున స్టూడియో పేరిట పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అంతేకాకుండా అక్ర‌మంగా ఓ చెరువు శిఖం భూమిని క‌బ్జా చేసి ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశార‌ని కూడా వ‌దంతులు వినిపించాయి. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కూల్చివేత‌కు ఏకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే.

ఇదిలా ఉంటే... నిన్న ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు, సంస్థ‌ల‌కు చెందిన రుణాల‌ను ర‌ద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో నాగార్జున‌కు చెందిన సంస్థ‌లు కూడా ఉన్నాయ‌న్న వాద‌న వినిపించింది. దీంతో వేగంగా స్పందించిన నాగార్జున‌... నేటి ఉద‌యం ట్విట్ట‌ర్ లో ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. తాను కాని, త‌న తండ్రి నిర్మించిన అన్న‌పూర్ణ స్టూడియోస్ కాని ఏ ఒక్కరికి సింగిల్ రూపాయి కూడా బాకీ లేమ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ పేరిట బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించిన నాగార్జున... వాటన్నింటినీ ఈ ఏడాది తొలి అర్ధ‌భాగంలోనే తీర్చేశాన‌ని చెప్పుకొచ్చాడు. కొంత మంది ఆరోపిస్తున్న‌ట్లుగా తాను కాని, అన్న‌పూర్ణ స్టూడియో కాని ఏ ఒక్క బ్యాంకుకు కూడా బాకీ లేమ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు