క్లయిమాక్స్‌ చెత్త అని ఒప్పేసుకున్నాడు

క్లయిమాక్స్‌ చెత్త అని ఒప్పేసుకున్నాడు

చాలా కాలం నిర్మాణ దశలోనే ఆగిపోయిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఎట్టకేలకు గడ్డు కాలంలో విడుదలైంది. పెద్ద నోట్ల రద్దుతో సినిమాలపై జనం ఆసక్తి చూపించని టైమ్‌లో దీనిని సాహసం చేసి విడుదల చేసారు. దీంతో సహజంగానే కలక్షన్లపై ప్రభావం తీవ్రంగా వుంది. హైదరాబాద్‌ మినహాయిస్తే ఎక్కడా సరైన వసూళ్లు రావడం లేదు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు ప్రస్తుత పరిస్థితుల వల్ల కొత్త సినిమాలు విడుదల చేయడానికి చాలా మంది జంకుతున్నారు.

దీని వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజుల పాటు థియేటర్లలో వుంచే అవకాశాలున్నాయి. తద్వారా లాంగ్‌ రన్‌లో సేఫ్‌ అయిపోతుందనే నమ్మకంతో నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ వున్నారు. ఇదిలావుంటే దీంట్లో చాలా ప్రయోగాలు చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, క్లయిమాక్స్‌కి వచ్చేసరికి పక్కా కమర్షియల్‌ చిత్రాన్ని ముగించినట్టు ముగించేసాడు. గౌతమ్‌ మీనన్‌ సినిమాలో ఇలాంటి క్లయిమాక్స్‌ ఊహించని వారు దానిని విమర్శిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ కూడా తప్పు అంగీకరించాడు. కొత్తగా వుంటుందని అలా ముగించానని, కానీ అది సరిగా రాలేదని ఒప్పుకున్నాడు. క్లయిమాక్స్‌ వేరేలా రాసుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల చిత్రీకరించలేకపోయానని, ఆ ఒక్క మైనస్‌ తప్పిస్తే చాలా మంది ఈ చిత్రం బాగుందని మెచ్చుకోవడం ఆనందంగా వుందని గౌతమ్‌ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు