'సాహసం..' క్లైమాక్స్ నిజంగా జరిగిందేనట

'సాహసం..' క్లైమాక్స్ నిజంగా జరిగిందేనట

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చూసిన వాళ్లంతా ప్రధానంగా ఒకచోట అభ్యంతరం వ్యక్తం చేశారు. అది క్లైమాక్స్ విషయంలోనే. సామాన్యుడైన హీరో రెండు మూడేళ్ల వ్యవధిలో ఐపీఎస్ అధికారిగా మారిపోయి రీఎంట్రీ ఇవ్వడం చాలా సిల్లీగా అనిపించింది. గౌతమ్ మీనన్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్ సినిమాల్లో ఇలాంటి సినిమాటిక్ క్లైమాక్స్ పెట్టడంపై అంతా ఆశ్చర్యపోయారు. సినిమా అంతా రియలిస్టిగ్గా సాగి.. చివరికి వచ్చేసరికి ఇలా ముగియడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ విమర్శలపై గౌతమ్ మీనన్ స్పందించాడు. ఈ క్లైమాక్స్ సినిమాటిగ్గా ఉన్నప్పటికీ అది నిజంగా జరిగిన విషయం అని గౌతమ్ వెల్లడించాడు.

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఆరంభంలోనే ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా అని వేస్తారు. అది క్లైమాక్స్‌కు సంబంధించిన విషయమేనని గౌతమ్ వెల్లడించాడు. ఇలా నిజంగానే తనకు తెలిసిన వ్యక్తి పోలీస్ అయ్యాడని.. దాని స్ఫూర్తితోనే సినిమా తెరకెక్కించానని తెలిపాడు. ఐతే ఈ క్లైమాక్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడాన్ని గౌతమ్ తేలిగ్గా తీసుకున్నారు. హేటర్స్ కోరుకున్నట్లు ఈ సినిమా రిజల్ట్ రాలేదని.. చాలామందికి క్లైమాక్స్‌తో పాటు సినిమా బాగా నచ్చిందని.. హేటర్స్ గురించి పట్టించుకోనని అన్నాడు గౌతమ్. ఐతే గౌతమ్ ఈ విషయాలన్నీ చెప్పింది తమిళ వెర్షన్ విషయంలోనే. తెలుగు వెర్షన్ పేరు కూడా ఆయన ఎక్కడా ఎత్తట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు